దూరమవుతున్న బంధం దగ్గరవ్వాలంటే…

దూరమవుతున్న బంధం దగ్గరవ్వాలంటే…

ప్రవర్తన మారింది
మాది ఉమ్మడి కుటుంబం. మాకు క్లాత్‌‌ స్టోర్‌‌ ఉంది. నాలుగు నెలల కిందట మా తమ్ముడికి పెళ్లి అయింది.  అప్పటి నుంచి నా భార్య చాలా చిరాగ్గా ఉంటోంది. పిల్లల మీద కోప్పడుతుంది. ఏడుస్తుంది. ఏమైందని అడిగినా చెప్పట్లేదు? –  కళ్యాణ్‌‌, అంబర్‌‌పేట

కొత్తగా పెళ్లైన మీ తమ్ముడు, అతడి భార్య ఎక్కువ సమయం ఇంట్లో కలిసి ఉండటం, మీరు బిజినెస్‌‌ పనుల్లో పడి మీ భార్యను సరిగా పట్టించుకోకపోవడం, ఇంట్లో ఉన్నా ఆమెతో సరిగా మాట్లాడకపోవడం, టైం ఇవ్వకపోవడం వల్ల అలా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. మీ ప్రవర్తనను మార్చుకోండి. రోజులో వీలైనంత ఎక్కువ టైం ఇంట్లో ఉండండి. ఇంట్లో ఉన్నప్పుడు సెల్‌‌ఫోన్‌‌లో గేమ్స్‌‌  ఆడడం, ఇతరులతో మాట్లాడటం, టీవీ చూడటం.. లాంటివి చేయొద్దు. వారానికి లేదా పదిహేను రోజులకొకసారి భార్యా పిల్లలతో కలిసి బయటకెళ్లండి. అప్పుడప్పుడు మీ భార్యను ఇంప్రెస్‌‌ చెయ్యడానికి గిఫ్ట్స్‌‌ ప్రజెంట్‌‌ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు ‘ఒంటరిగా ఉన్నాను’ అనే ఫీలింగ్‌‌ రాకుండా చూసుకోండి. తప్పకుండా మీ భార్యలో మార్పు వస్తుంది.

 

మా ఆయన,  నేను సాఫ్ట్‌‌ వేర్‌‌ ఇంజినీర్స్‌‌. పిల్లలు చిన్నవాళ్లు అవడంతో నేను వర్క్‌‌ ఫ్రం హోం చేస్తున్నా.   ఇటీవల మా ఆయన బిహేవియర్‌‌లో మార్పు వచ్చింది. నాతో సరిగా మాట్లాడటం లేదు. ఇంటికొచ్చినా సెల్‌‌ఫోన్‌‌తోనే బిజీగా ఉంటున్నాడు. పిల్లలతో కూడా సరిగా ఉండటం లేదు. నేను అడిగితే ఏం చెప్పడం లేదు. కోప్పడుతున్నాడు. పరిష్కారం చెప్పండి? – ప్రత్యూష, మియాపూర్‌‌

మీ భర్త మీతో  టైం స్పెండ్‌‌ చేయడం లేదంటే ఆఫీసులో  పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు.  ముందు మీ ఇద్దరి మధ్య రిలేషన్‌‌ను ఇంకా బిల్డప్‌‌ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆయన కోసం ఎక్కువ టైం కేటాయించండి. రోజులో వీలైనంత ఎక్కువసేపు ఇద్దరూ మాట్లాడుకోండి. దాంతో ఒకరి మనసులో ఏముందో మరొకరికి తెలిసిపోతుంది. తప్పనిసరిగా మీ ఆయన తన సమస్య ఏంటో చెప్తాడు. ‘నేను’ ‘నాది’ అని  కాకుండా, మనం అన్న భావనతో ఉండండి. టాక్‌‌, టైం, టచ్‌‌, ట్రస్ట్‌‌, టోలరెన్స్‌‌.. మీ ఇద్దరి మధ్యా ఉంటే ఎలాంటి సమస్యలు రావు. అన్ని విధాలా మీరు ప్రయత్నం చేసినా మీ  ఆయనలో మార్పు రాకపోతే మీ అమ్మానాన్నలకు చెప్పండి. మీ అత్తమామలను కూడా పిలిపించి మాట్లాడండి. తప్పక పరిష్కారం దొరుకుతుంది.

అనుమానిస్తున్నాడు
నా భర్తకు నా మీద అనుమానం. బంధువులతో ఫోన్‌‌ మాట్లాడుతున్నా అనుమానంగా చూస్తాడు. ఎవరు? ఎందుకు? ఏం మాట్లాడావు? అని అడుగుతాడు. నిజం చెప్పినా నమ్మడు. ఒక్కోసారి జీవితం మీద విరక్తి కలుగుతుంది. చచ్చిపోదామని అనిపిస్తుంది. ఏం చేయమంటారు? – నివేదిత, కరీంనగర్‌‌

మీ భర్తకు మీ మీద నమ్మకం లేదు. అందుకు పెళ్లికాక ముందు లైఫ్‌‌ కొంత కారణం కావచ్చు. చెడు రిలేషన్స్‌‌ను ఎక్కువగా చూసి ఉంటాడు. అందుకే మిమ్మల్ని కూడా అనుమానంతో చూస్తూ ఉండొచ్చు. మీరు చదువుకునేటప్పుడు ఎఫైర్స్‌‌ ఉండొచ్చని ఊహించుకొని ఉంటాడు. దాంతో మీ క్యారెక్టర్‌‌ అతడికి తెలిసిన వాళ్లలాంటిదేనని అనుకుంటున్నాడు. ఇలాంటి మెంటాలిటీని ‘పారనోయిడ్‌‌’ అంటారు.  మీ ఫ్యామిలీ లైఫ్‌‌ బాగుండాలంటే మీ ఇద్దరి మధ్య నమ్మకం పెరగాలి. ఓపిక ఉండాలి.  మీ ఆయనను కౌన్సెలర్‌‌ దగ్గరకు తీసుకుపోయి చూపించి, ట్రీట్‌‌మెంట్‌‌ ఇప్పించండి. తప్పకుండా అతడిలో ఉన్న అనుమానం పోతుంది. 

విడాకులు కావాలి
మా పెళ్లై ముప్పై ఐదేళ్లయింది. ముగ్గురు పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి అభిమానం లేదు. ఇంతకాలం పిల్లలకోసం మాత్రమే కలిసున్నాం. మా వల్లకావడం లేదు. విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం. సలహా ఇవ్వండి?- శ్రీదేవి, మెదక్‌‌

మీరిద్దరు ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకోండి. పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకరిమీద ఒకరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో చెప్పుకోండి. ఒకరి వల్ల ఒకరు సంతోషించిన సందర్భాలు గుర్తుచేసుకోండి. బాధపెట్టిన సంఘటనలు ఉన్నా నిర్మొహమాటంగా చెప్పుకోండి. ఎలాంటి దాపరికాలు ఉండకుండా చూసుకోండి. ఒకరి విషయంలో ఇంకొకరు తప్పులు చేసున్నా మొహమాటం లేకుండా చెప్పండి. ఇగోలను పక్కనబెట్టి బాధపెట్టి ఉంటే మనఃస్పూర్తిగా ‘సారీ’ చెప్పండి. కావాలంటే మీ పిల్లలను పిలిచి మీ సమస్యల గురించి వాళ్లతో చర్చించండి. ఈ వయసులో విడాకులు తీసుకుంటే అందరూ ఇబ్బందులు పడతారు.