- ఖాళీ సిలిండర్లు, ఆటోలకు తాళ్లు కట్టి సీపీఐ నిరసన
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తప్పుడు నినాదాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సామాన్యుల నడ్డి విరుస్తున్న ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. శనివారం హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి హిమాయత్ నగర్ వై జంక్షన్ వరకు ఖాళీ సిలిండర్లు, ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రగల్భాలు పలుకుతూనే.. పెట్రోల్ వాడకం తగ్గించాలని ప్రజలను భయపెట్టడం సిగ్గుచేటన్నారు.
గతంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని చాకచక్యంగా కాపాడారని, కానీ మోదీ మాత్రం పేదల రక్త మాంసాలను పీల్చి కార్పొరేట్లకు ధారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. మోసాలతో ప్రజలను ఎక్కువ కాలం నమ్మించడం సాధ్యం కాదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, సీనియర్ నాయకులు ప్రేమ్ పావని, ఛాయాదేవి, కమతం యాదగిరి, వెంకటేశం, పల్లె నరసింహ, అనిల్ పాల్గొన్నారు.
