- సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ
- పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్నులను తగ్గించాలి
- డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం, అధిక పన్నులు మోపడం వల్ల రవాణా రంగంపై పెను భారం పడుతోందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు. యుద్ధాలు, ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా ముడి చమురు ధరలు పెరుగుతాయని, ఈ భారాన్ని సామాన్య ప్రజలు భరించాల్సి వస్తోందన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. ఈమేరకు శుక్రవారం వీడియో ద్వారా ఆయన సందేశాన్ని పంపించారు.
సామాన్యుల నడ్డివిరిచారు: కూనంనేని
పెంచిన పెట్రో ధరలు తగ్గించాలని శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వాణిజ్య సిలెండర్‌పై రూ.1000 పెంచిన కేంద్ర ప్రభుత్వం.. నెల రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో బీజేపీ సభలో ప్రధాని మోదీ పొదుపు మంత్రం జపించిన కొన్ని రోజులకే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారని ఫైర్అయ్యారు.
పన్నులతో కేంద్రం దోచుకుంటోంది: ఎమ్మెల్సీ సత్యం
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో సామాన్య ప్రజలపై భారం పడుతుందని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా కేంద్రం భారీ పన్నులతో ప్రజలను దోచుకుంటోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల నిత్యావసర ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
