బషీర్‌బాగ్, వెలుగు: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత తీసుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను ఖండిస్తూ గురువారం హైదరాబాద్‌లో సీపీఐ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. హిమాయత్‌నగర్ లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం సరికాదన్నారు.
ఆందోళన చేస్తున్న విద్యార్థులు, మహిళలపై లాఠీచార్జ్ చేయడాన్ని ఖండించారు. ఈ ఘటనపై కోర్టులు కూడా స్పందించాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్నా కేంద్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థుల డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు. సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ మాట్లాడుతూ విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయంగా చూడొద్దన్నారు.
ఇది విద్యా వ్యవస్థను కాపాడాలనే యువత ఉద్యమమని చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత తీసుకుని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఈ.టి.నరసింహ, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కార్యకర్తలు పాల్గొన్నారు.
