ఉద్యోగాల భర్తీలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌వెస్లీ

ఉద్యోగాల భర్తీలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌వెస్లీ

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు యువత భవిష్యత్తును గాలికొదిలేశాయని, ఉద్యోగాల భర్తీలో ఘోరంగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌వెస్లీ విమర్శించారు. యువతను చైతన్యపరిచేందుకు, వారి సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌‌‌‌లోని కొత్తపేట బీజేఆర్ భవన్‌‌‌‌లో ‘యువజన సమ్మేళనం’ నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌‌‌‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. రెండ్రోజులపాటు జరిగే ఈ యువజన సమ్మేళనానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాజ్యసభ సభ్యుడు ఏఏ.రహీం హాజరవుతారని తెలిపారు.

యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వేదికగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఆ హామీని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వశాఖల్లో 60 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఒక్క రైల్వేలోనే 10 లక్షల ఖాళీలున్నాయని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని జాన్‌‌‌‌వెస్లీ ప్రశ్నించారు.