- ‘రేటు ఆగదు డిమాండ్ తగ్గదు’ అనే నినాదంతో నిర్వహణ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రియల్ ఎస్టేట్ వెంచర్ల వివరాలన్నీ ఒకే చోట అందుబాటులో ఉంచేందుకు కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఆధ్వర్యంలో భారీ ప్రాపర్టీ షోను నిర్వహించనున్నట్టు క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ వెల్లడించింది. ‘రేటు ఆగదు – డిమాండ్ తగ్గదు’ అనే నినాదంతో ఆగస్టు 28, 29, 30 తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ ఎగ్జిబిషన్ జరగనుందని తెలిపింది.
గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ ఎన్. జయదీప్ రెడ్డి, కన్వీనర్ జయపాల్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్‌లో 70 మందికి పైగా డెవలపర్లు పాల్గొని, 350కి పైగా ప్రాపర్టీ వెంచర్లను ప్రదర్శించనున్నారని తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా పలు ప్రాజెక్టులను అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రోజురోజుకూ పుంజుకుంటోందని ఒక రోజు ఉన్న ధర మరో రోజు ఉండటం లేదని పేర్కొన్నారు. సిటీకి ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో డిమాండ్ భారీగా పెరుగుతోందని వివరించారు. స్థిరాస్తి కొనడానికి ఆలోచన అవసరం లేదని ఎప్పుడు కొనాలని అనుకుంటే వెంటనే కొనుగోలు చేయడం మంచిదని సూచించారు. సమావేశంలో క్రెడాయ్ ఉపాధ్యక్షుడు జగన్నాథరావు, అనిల్ రెడ్డి, ట్రెజరర్ నితీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్ బన్సల్, కన్వీనర్ వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
