- అప్పులు తీర్చేందుకు మహిళ మెడలో గొలుసు లాకెళ్లిండు
- నకిలీ నంబర్ ప్లేట్‌తో స్కెచ్.. నిందితుడు అరెస్ట్
మల్కాజిగిరి, వెలుగు: క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఓ ఆర్మీ జవాన్‌ను చైన్ స్నాచర్‌గా మార్చింది. అప్పులు తీర్చేందుకు మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన నిందితుడిని నేరెడ్మెట్ అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఏసీపీ యాదగిరి రెడ్డి గురువారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. కడప జిల్లా సంబేపల్లె మండలానికి చెందిన కుర్రపోతుల రెడ్డిశేఖర్ (31) ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తూ, ప్రస్తుతం అల్వాల్‌లోని ఆర్మీ క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసై, భారీగా నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక గొలుసు దొంగతనాలకు ప్లాన్ వేశాడు.
నకిలీ నంబర్ ప్లేట్‌తో..
నిందితుడు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన పల్సర్ బైక్ ఒరిజినల్ నంబర్ ప్లేట్ పైన నకిలీ నంబర్ స్టిక్కర్‌ను అతికించాడు. ఈ నెల10న రాత్రి 7 గంటల సమయంలో సప్తగిరి కాలనీలో ఒంటరిగా వెళ్తున్న మణి మేఘల (57) అనే మహిళను చిరునామా అడుగుతున్నట్లు నటించి అడ్డగించాడు. ఆమె తేరుకునేలోపే మెడలోని 3 తులాల నల్లపూసల గొలుసును తెంచుకుని పరారయ్యాడు.
ఆ బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ. 2.10 లక్షలు తీసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నేరెడ్మెట్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బుధవారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ పి. సందీప్ కుమార్, ఎస్ఐ జి. చంద్రశేఖర్ బృందం అతి తక్కువ కాలంలోనే ఈ కేసును ఛేదించడంతో ఉన్నతాధికారులు వారిని అభినందించారు.
