మాస్క్ కట్టుకోలేదని సీఆర్ పీఎఫ్ కమాండోకు గొలుసులు

మాస్క్ కట్టుకోలేదని సీఆర్ పీఎఫ్ కమాండోకు గొలుసులు

న్యూఢిల్లీ: కర్నాటకలోని బెళగావి పోలీసు స్టేషన్ లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్) కమాండో గొలుసులతో కట్టేసి ఉండటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సచిన్ సునీల్ సావంత్ అనే కోబ్రా కమాండో గొలుసులతో కట్టేసి ఉన్న ఫొటోను ఓ యూజర్ ట్విట్టర్ లో పోస్టు చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్ అయింది. ఈనెల 11 వరకు సావంత్ లీవ్ లో ఉన్నాడు. లాక్ డౌన్ పొడిగించడంతో సావంత్ ఇంటి వద్దే ఉన్నాడు. అలా ఒక రోజు బయటకు వెళ్లగా పోలీసులు అరెస్టు చేశారు. మాస్కు కట్టుకోకుండా కనిపించిన సావంత్ ను ఆపామని పోలీసులు చెప్పారు. ముఖానికి మాస్కు కట్టుకోకుండా వీధుల్లో ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తే.. సావంత్ అసభ్య పదజాలంతో దురుసుగా మాట్లాడాడని పోలీసులు చెప్తున్నారు. అతడ్ని వెంటనే అరెస్టు చేసి జుడీషియల్ కస్టడీకి పంపించారు. ఈ ఘటన ఈ నెల 23న చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఆర్ పీఎఫ్​దీనికి సంబంధించి కర్నాటక పోలీస్ చీఫ్ కు లేఖ రాసింది. మంగళవారం సావంత్ బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వెళ్తుంది. దీనికి స్థానిక అధికారి సాయంతో సీఆర్ పీఎఫ్​ కూడా హాజరు కానుంది. పోలీసులు సావంత్ ను లాఠీలతో దారుణంగా కొట్టారని, బేడీలు కూడా వేశారని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కోబ్రా యూనిట్–207లో సావంత్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇది యాంటీ నక్సల్ ఆపరేషన్స్ కోసం పనిచేస్తుంది. ఈ ఘటనతో సావంత్ ను సదరు యూనిట్ సస్పెన్షన్ లో ఉంచింది.