ఆరున్నర కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు
అడ్వెంచర్ ప్రయాణాలు మర్చిపోలేని కిక్కిస్తాయి. ఊపిరి బిగబట్టుకొని ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మధ్య సాగే జర్నీ చేస్తే ఆ థ్రిల్లే వేరు. ఇలాంటి రికార్డు బ్రేకింగ్ మూమెంట్ గతవారం గ్రీస్‌లో జరిగింది. అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఇరుకైన కొరింత్ కెనాల్ నుంచి ప్రయాణించి రికార్డు సృష్టించింది. 24 వేల టన్నుల బరువైన క్రూయిజ్ షిప్పు, 1,200 మంది ప్రయాణికులతో 24 మీటర్ల వెడల్పే ఉన్న ఆ కెనాల్‌లో 6.3 కిలోమీటర్లు నడిచింది. టగ్ బోటు ముందు వెళ్తుంటే క్రూయిజ్ షిప్ దాన్ని ఫాలో అయింది.
కెనాల్‌లో షిప్పు వెళ్తుంటే ఓ బిల్డింగ్ కదులుతున్నట్లు కనిపించింది. ఈ రిస్కీ ప్రయాణాన్ని ప్యాసింజర్లు ఎంజాయ్ చేశారు. రెండు వైపులా ఉన్న రాళ్లగోడను టచ్ చేస్తూ ఆనందించారు. ఈ వివరాలను బ్రేమర్ క్రూయిజ్ షిప్ సంస్థ ఫ్రెడ్ ఓల్సన్ తెలిపింది. కొరింత్ కెనాల్‌లో తమ బ్రేమర్ క్రూయిజ్ లైనర్ షిప్ సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణించిందని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. ఫొటోలు, వీడియోను షేర్ చేసింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను 7 లక్షల మంది చూశారు. 171 ఏళ్ల చరిత్ర ఉన్న తమ సంస్థలో ఇదొక అద్బుతమైన మైలురాయి అని సంస్థ చెప్పింది. కొరింత్ కెనాల్ గల్ఫ్ ఆఫ్ కొరింత్, సారోనిక్ గల్ఫ్‌లను కలుపుతుంది. గ్రీస్ మెయిన్ ల్యాండ్‌ను పెలోపినోసస్‌ను వేరు చేస్తుంది.
