ఏ దేశంలో లేనంతగా ఎనర్జీ వాడకం ఇండియాలో పెరిగింది

ఏ దేశంలో లేనంతగా ఎనర్జీ వాడకం ఇండియాలో పెరిగింది

న్యూఢిల్లీ: దేశంలో కరెంట్ వాడకం విపరీతంగా పెరుగుతుందని ఇంటర్నేషనల్ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనావేస్తోంది. కరెంట్‌‌ ప్రొడక్షన్ కోసం కోల్‌‌పై ఎక్కువగా ఆధారపడతామని, ఆ తర్వాత  రెన్యూవబుల్ ఎనర్జీ, పెట్రోలియం ప్రొడక్ట్‌‌లపై ఆధారపడతామని వెల్లడించింది. గ్లోబల్‌‌గా ఏ దేశంలో కూడా ఎనర్జీ వాడకం ఇండియాలో పెరిగినంతగా ఉండదని వెల్లడించింది. తాజాగా  వరల్డ్స్‌‌ ఎనర్జీ అవుట్‌‌లుక్‌‌ రిపోర్ట్‌‌ను విడుదల చేసిన ఈ సంస్థ, దేశంలో పెరుగుతున్న ఇండస్ట్రియలైజేషన్‌‌, అర్బనైజేషన్ వలన ఎనర్జీ డిమాండ్ కూడా ఎక్కువవుతుందని పేర్కొంది. 2030 నాటికి దేశంలో పవర్ డిమాండ్‌‌ విపరీతంగా పెరుగుతుందని, ఈ పెరిగిన డిమాండ్‌‌లో 60 శాతం వాటాను  రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా చేరుకుంటామని ఐఈఏ అంచనావేసింది. కానీ, 2030 నాటికి దేశానికి అవసరమయ్యే మొత్తం డిమాండ్‌‌లో మూడో వంతు వాటాను బొగ్గు ద్వారానే చేరుకుంటామని, ఆ తర్వాత మెజార్టీ డిమాండ్‌‌ను పెట్రోలియం ప్రొడక్ట్‌‌ల ద్వారా చేరుకుంటామని  లెక్కించింది. ప్రభుత్వం  ఎనర్జీ సెక్టార్‌‌‌‌లో తీసుకొస్తున్న, తీసుకొచ్చిన పాలసీలను పరిగణనలోకి తీసుకొని ఈ రిపోర్ట్‌‌ను ఐఈఏ విడుదల చేసింది. 

ఏడాదికి 3 శాతం చొప్పున పైకి..

‘2025 నాటికి  ప్రపంచంలోనే ఎక్కువ మంది జనాభా ఉన్న దేశంగా ఇండియా మారుతుంది. అర్బనైజేషన్‌‌, ఇండస్ట్రియలైజేషన్‌‌.. రెండు అంశాలు ఎనర్జీ డిమాండ్ విపరీతంగా పెరగడానికి కారణమవుతాయి. 2021–2030 మధ్య దేశ ఎనర్జీ డిమాండ్ ఏడాదికి 3 శాతం చొప్పున పెరుగుతుంది. ఎనర్జీ డిమాండ్ ఇంతలా ఏ దేశంలో కూడా పెరగదు’ అని ఐఈఏ పేర్కొంది.  ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీ కోసం వివిధ పాలసీలు తీసుకొస్తున్నా, రానున్న 10 ఏళ్లలో దేశ క్రూడాయిల్‌‌, బొగ్గు దిగుమతులు రెండింతలు పెరుగుతాయని లెక్కించింది.  ఫలితంగా గ్లోబల్‌‌గాఎనర్జీ సెక్యూరిటీ రిస్క్‌‌లో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉక్రెయిన్‌‌– రష్యా యుద్ధం వలన గ్లోబల్‌‌గా ఎనర్జీ సంక్షోభం నెలకొంది. పెట్రోలియం ప్రొడక్ట్‌‌ల ఎగుమతుల్లో రష్యా టాప్‌‌లో ఉంటుంది. కానీ, ఈ దేశం యూరప్‌‌కు నేచుర్‌‌‌‌ గ్యాస్‌‌ సప్లయ్‌‌ను ఆపేయడం, యురోపియన్ దేశాలు రష్యా నుంచి బొగ్గు, క్రూడాయిల్‌‌ను దిగుమతి చేసుకోమని నిర్ణయించుకోవడంతో ఎనర్జీ సెక్టార్‌‌‌‌లో సంక్షోభం నెలకొంది. అంటే గ్లోబల్‌‌గా గ్యాస్ రేట్లు,  క్రూడాయిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి.  

బొగ్గే ఆధారం..

ఇండియాలో బొగ్గు డిమాండ్‌‌ 2030 నాటికి ఏడాదికి 77 కోట్ల టన్నుల కోల్‌‌ ఈక్విలెంట్ (ఎంటీసీఈ) కి చేరుకుంటుందని,  2030 స్టార్టింగ్‌‌లో డిమాండ్‌‌ పీక్‌‌ లెవెల్‌‌ చేరుకుంటుందని ఐఈఏ వివరించింది. ఆయిల్ డిమాండ్  2030 నాటికి రోజుకి  70 లక్షల బ్యారెల్స్‌‌కు చేరుకుంటుందని తెలిపింది. కిందటేడాది ఇది రోజుకి 47 లక్షల బ్యారెల్స్‌‌గా ఉంది. బొగ్గు డిమాండ్ పెరిగినప్పటికీ  2030 నాటికి మొత్తం కరెంట్ ఉత్పత్తిలో  బొగ్గు ప్రాజెక్ట్‌‌ల వాటా ప్రస్తుతం ఉన్న 75 % నుంచి 55 శాతానికి పడిపోతుందని ఐఈఏ వివరించింది. కిందటేడాది బొగ్గు ప్రాజెక్ట్‌‌ల నుంచి  240 గిగా వాట్ల పవర్ ఉత్పత్తి కాగా, 2030 నాటికి  ఈ నెంబర్‌‌‌‌ 275 గిగా వాట్లకు పెరుగుతుందని అంచనా. కిందటేడాది బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా మారిన ఇండియా, 2025 నాటికి తన బొగ్గు ప్రొడక్షన్‌‌ను 100 మెట్రిక్‌‌ టన్నుల కోల్ ఈక్విలెంట్‌‌ పెంచుతుందని ఐఈఏ అంచనావేసింది. 2030 నాటికి దేశ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిలో రెన్యూవబుల్ ఎనర్జీ వాటా 35 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. ఇందులో ఒక్క సోలార్ ఎనర్జీ వాటానే 15 శాతంగా ఉంటుందని లెక్కించింది. ‘అయినప్పటికీ  దేశ ఎనర్జీ డిమాండ్‌‌లో మూడో వంతు బొగ్గు ద్వారానే తీరుతుంది. ఆయిల్‌‌ డిమాండ్‌‌ ముఖ్యంగా ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌ సెక్టార్‌‌‌‌లో ఉంటుంది’  అని ఐఈఏ పేర్కొంది. 2070 నాటికి నెట్  జీరో దేశంగా మారాలన్న ఇండియా  కోరిక తీరాలంటే తక్కువ ఎమిషన్స్ ఉన్న పద్ధతులను ఎంచుకోవాలని సూచించింది.  

గ్యాస్‌‌‌‌ డిమాండూ పైకే..

ఐఈఏ రిపోర్ట్ ప్రకారం నేచురల్ గ్యాస్ డిమాండ్ కిందటేడాది 66 బిలియన్ క్యూబిక్ మీటర్స్ (బీసీఎం) గా నమోదు కాగా, 2030 నాటికి ఇది 115 బీసీఎంకు పెరుగుతుంది.  మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ విస్తరించడం, ఇతర ఇండస్ట్రీలు వృద్ధి చెందడంతోనే నేచురల్ గ్యాస్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. దీనికి మెరుగుపరిచిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌‌వర్క్ సాయపడుతుంది. దేశంలో కరెంట్ ఉత్పత్తిలో గ్యాస్ వాటా 5 శాతం కంటే తక్కువగానే ఉంది. కానీ, గ్యాస్ డిమాండ్‌‌ 10 బీసీఎం పెరగడానికి ఈ వాటా సరిపోతుందని ఐఈఏ అంచనావేసింది. ‘ఆయిల్  అండ్ గ్యాస్ ఫీల్డ్‌‌లను అన్వేషించడానికి ప్రభుత్వం లైసెన్స్‌‌లను ఇవ్వడం పెంచింది. అయినప్పటికీ రానున్న పదేళ్లలో దీని వలన క్రూడాయిల్ ఉత్పత్తి ఎక్కువగా పెరగకపోవచ్చు’ అని వివరించింది.