మా నియోజకవర్గంలో మీ పెత్తనమేందంటున్న ఎమ్మెల్యేలు

మా నియోజకవర్గంలో మీ పెత్తనమేందంటున్న ఎమ్మెల్యేలు
  • మా వాళ్లకంటే మా వాళ్లకంటూ పంచాది
  • లిస్టులో మా అనుచరుల పేర్లు చేర్చాలంటున్న మంత్రులు
  • మా నియోజకవర్గంలో మీ పెత్తనమేందంటున్న ఎమ్మెల్యేలు
  • పూటకో తీరుగా మారుతున్న అర్హుల జాబితా

హైదరాబాద్​, వెలుగు: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య దళిత బంధు స్కీం చిచ్చు పెడుతున్నది. తాము చెప్పిన వాళ్ల పేర్లు అర్హుల లిస్టులో ఉండాల్సిందేనని ఎమ్మెల్యేలకు మంత్రులు సిఫార్సుల మీద సిఫార్సులు చేస్తున్నారు. తాము చేయాల్సిన పనుల్లో మంత్రుల జోక్యం ఏందని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. సొంత నియోజకవర్గంలో దళిత బంధుకు ఎవరిని ఎప్పుడు ఎంపిక చేయాలో తమకు తెల్వదా అని ఎమ్మెల్యేలు అంటుంటే.. జిల్లా ఇన్​చార్జ్​ మంత్రినైన తాను రికమండ్​ చేస్తే లిస్ట్​లో పేరు పెట్టుకోరా? అంటూ మంత్రులు దబాయిస్తున్నారు. ఈసారి ఒక్కో నియోజకవర్గం నుంచి 1,500 దళిత కుటుంబాలను దళితబంధు స్కీంకు ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అర్హుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేల చేతిలో పెట్టింది. ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో దళిత కుటుంబాలు ఉంటే.. 1,500 మంది కుటుంబాలను ఎలా సెలెక్ట్​ చేసి పంపివ్వాలనే దానిపైనే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. అదే టైంలో మంత్రుల సిఫార్సు లెటర్లు వారికి వస్తున్నాయి. ఫలితంగా అర్హుల లిస్ట్​ పూటకో రకంగా మారుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం దళిత బంధు పథకం ఇప్పటి వరకు మొదలు కాలేదు. నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ ఇంతవరకూ నిధులు రిలీజ్​ చేయలేదు. పోయిన సంవత్సరానికి సంబంధించే ఇంకా 8 వేల మందికి యూనిట్లు గ్రౌండ్​ కాలేదు.

కొందరు ఎమ్మెల్యేలకు అయితే ముగ్గురు మంత్రుల నుంచి కూడా సిఫార్సులు వస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని ఒక నియోజకవర్గం.. కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల పరిధిలో ఉంది. దీంతో ఆ ఎమ్మెల్యేకు ముగ్గురు మంత్రుల నుంచి సిఫార్సు లెటర్లు అందాయి.  1,500 మంది పేర్లలో తమవారినే సర్దుబాటు చేసుకోలేకపోతుంటే.. మంత్రుల నుంచి ఏకంగా ఆ ఎమ్మెల్యేకు 350 మంది పేర్లతో సిఫార్సు లెటర్లు అందినట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి విడిపోయిన తర్వాత తమ జిల్లా నుంచి మంత్రి ప్రాతినిధ్యమే లేదని, అయినా కూడా ఓ మంత్రి నుంచి తమకు సిఫార్సు లెటర్లు అందుతున్నాయని యాదాద్రి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు వాపోయారు. ఇక నిజామాబాద్​ జిల్లాకు చెందిన ఓ మంత్రి.. అటు కామారెడ్డి, ఇటు సొంత జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు లిస్ట్​ తయారు చేసి పంపుతున్నట్లు తెలిసింది. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల నుంచి ఎమ్మెల్యేలకు రోజులో ఐదారు ఫోన్​ కాల్స్​ దళితబంధు గురించే వస్తున్నట్లు ఓ ఎమ్మెల్యే తెలిపారు.
 
వినకపోతే ఇంకో దాంట్లో దొరకరా!
దళిత బంధు అర్హుల లిస్టులో తాము సూచించినవాళ్ల పేర్లు చేర్చకపోతే ఎమ్మెల్యేలను కొందరు మంత్రులు మరో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. “జిల్లా మంత్రిగా నేను చెప్పినప్పుడు.. ఎమ్మెల్యే వినాల్సిందే. విని పనిచేస్తే సరే. లేదంటే ఇంకో పనికి నా దగ్గరకు ఎమ్మెల్యే రారా” అని  సీఎంకు దగ్గరగా ఉండే ఒక మంత్రి మీడియాతో అనడం గమనార్హం. “నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, టెండర్లు ఇట్ల మస్త్​గా పనులు  ఉంటయ్​. వాటికోసం ఎమ్మెల్యే మా దగ్గరకు రారా. మేం చెప్పిన పేర్లు లిస్టులో పెట్టకుంటే, ఆ పనుల్లో ఇర్కవడ్తం’’  అని మరో మంత్రి అన్నారు. 

పోయిన ఏడాదిదే ఇంకా కంప్లీట్​ చేయలే
పోయిన ఏడాదికి సంబంధించిన దళిత బంధు యూనిట్లు ఇంకా పూర్తి కాలేదు. నిధులు లేకపోవడంతోనే యూనిట్లు మంజూరు చేయడం లేదని ఆఫీసర్లు చెప్తున్నారు. హుజూరాబాద్​ బై ఎలక్షన్​ సందర్భంగా రాష్ట్ర సర్కార్ అక్కడ పైలట్​ ప్రాజెక్టుగా స్కీంను పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు నెలలోనే ఆ నియోజకవర్గంలో 18,211 మంది అర్హులకు రూ.10 లక్షల చొప్పున సాయం అందించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్కడ ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత స్కీం నెమ్మదించింది. ఏడాది కావొస్తున్నా హుజూరాబాద్​ నియోజకవర్గంలో 3 వేల మంది దళితులకు యూనిట్లు గ్రౌండ్​ కాలేదు. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున 11,835 మందికి స్కీం అమలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇందులోనూ ఇంకో 1,050 యూనిట్లు గ్రౌండ్​ చేయాల్సి ఉన్నది. నిజాంసాగర్​, చింతకాకని, చారగొండ, తిరుమలగిరి మండలాల్లోనూ దళితులందరికీ దళితబంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఈ నాలుగు మండలాలకు సంబంధించి బడ్జెట్​ ఉత్తర్వులు కూడా ఎప్పుడో ఇచ్చారు.  ఈ నాలుగు మండలాల్లో 8,518 మంది అర్హులను గుర్తించారు. ఇందులో 4,736 అంటే సగం మందికే  యూనిట్లు గ్రౌండ్​ చేశారు.

ఒకటి, రెండు అంటే ఓకే.. కానీ
నిరుడు నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేసినప్పుడే నానా తంటాలు పడ్డామని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇప్పుడు 1,500 మందిలో మంత్రుల నుంచే వందల సంఖ్యలో సిఫార్సులు ఉంటున్నాయని, ఇక అందులో తాము ఎంపిక చేసేది ఏముంటుందని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో ఉండేది తాము అని, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమన్వయం చేసుకుందామనుకుంటే మంత్రులు ఇష్టమొచ్చినట్లు పేర్లను సిఫార్సు చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటీ రెండు పేర్లంటే ఓకే కానీ, కుప్పలు తెప్పలుగా మంత్రుల నుంచి సిఫార్సుల లెటర్లు వస్తున్నాయని చెప్తున్నారు. అదే మంత్రి నియోజకవర్గంలో తమకు తెలిసిన వారికి దళితబంధు ఇప్పించాలని తాము అడిగితే వింటారా అని నిర్మల్​ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే  మీడియా చిట్​చాట్​లో అన్నారు. 

మీ నియోజకవర్గంలో తయారు చేసే దళితబంధు అర్హుల లిస్టులో మేం చెప్పిన వాళ్ల పేర్లు ఉండాలె. వాళ్లకు మస్ట్​గా ప్రయారిటీ ఇయ్యాలె. జిల్లా మంత్రిగా ఇది నా సిఫారసు​. వినకపోతే అభివృద్ధి పనులు, టెండర్లు ఇట్ల దేనికోసమైనా మా దగ్గరికి మీరు రాకపోతరా.. అప్పుడు మీ సంగతి చూసుకుంటం.
- ఇదీ ఎమ్మెల్యేకు ఓ మంత్రి హుకుం

ఒక్కో నియోజకవర్గానికి దళిత బంధు లిస్టులో చేర్చాల్సింది 1,500 మంది పేర్లనే. అందులో పార్టీ కార్యకర్తలు, మా అనుచరులు పోను ఇంకా పేర్లు చేర్చడానికి జాగా ఏడుంటది? వందల మంది పేర్లను మీరే సిఫార్సు చేస్తే.. మేమెందుకు? లిస్టును తయారు చేసే బాధ్యత మాకెందుకు?
- ఇదీ మంత్రిపై ఓ ఎమ్మెల్యే ఆగ్రహం