PBKS vs RCB: చిత‌క్కొట్టిన బెంగ‌ళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242

PBKS vs RCB: చిత‌క్కొట్టిన బెంగ‌ళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242

చావోరేవో పోరులో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ్యాటర్లు అద్భుత ఆట తీరు కనబరిచారు. ధ‌ర్మశాల‌ గడ్డపై పరుగుల వరద పారించారు. విరాట్ కోహ్లీ(92; 46 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రజత్ పాటిదార్(23 బంతుల్లో 55 పరుగులు), కామెరాన్ గ్రీన్(27 బంతుల్లో 46 పరుగులు*) చేశారు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీని.. పంజాబ్ అరంగేట్ర పేస‌ర్ విధ్వత్ క‌వెర‌ప్ప దెబ్బకొట్టాడు. తొలి ఓవ‌ర్లోనే కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(9)ను ఔట్ చేసిన క‌వెర‌ప్ప.. త‌ర్వాతి ఓవ‌ర్లో డేంజ‌రస్ విల్ జాక్స్(12)ను వెన‌క్కి పంపాడు. దాంతో 43 ప‌రుగుల‌కే బెంగ‌ళూరు 2 వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన‌ ర‌జ‌త్ పటిదార్(55) పంజాబ్ బౌల‌ర్లను చిత‌క్కొట్టాడు. 23 బంతుల్లోనే అర్ధ సెంచ‌రీతో జ‌ట్టు స్కోర్‌ ప‌రుగులు పెట్టించాడు. ధాటిగా ఆడుతున్న అత‌డు బెయ‌ర్‌స్టోకు దొరికాడు. దాంతో, 119 ప‌రుగుల వ‌ద్ద ఆర్సీబీ మూడో వికెట్ ప‌డింది. ఆ సమయంలో కాసేపు వరుణుడు అంతరాయం కలిగించాడు.

కొద్దిసేపటి అనంతరం ఆట తిరిగి ప్రారంభం కాగా.. విరాట్ కోహ్లీ (92) కామెరూన్ గ్రీన్ (46*)జోడి నిలకడగా ఆడుతూ రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నారు. కీలక సమయంలో కోహ్లీ వెనుదిరిగినా.. ఆఖరిలో దినేష్ కార్తీక్(7 బంతుల్లో 18 పరుగులు) విలువైన పరుగులు చేశాడు. అయితే, చివరి ఓవర్‌లో  హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టి.. ఆర్సీబీ స్కోర్ 250  దాటకుండా కట్టడి చేశాడు. 

పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీసుకోగా.. క‌వెర‌ప్ప 2, అర్షదీప్ సింగ్, సామ్ కరన్ చెరో వికెట్ పడగొట్టారు.