PBKS vs RCB: పంజాబ్‌ను మట్టికరిపించిన బెంగళూరు.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

PBKS vs RCB: పంజాబ్‌ను మట్టికరిపించిన బెంగళూరు.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ధర్మశాల గడ్డపై పంజాబ్‌ను 60 పరుగుల తేడాతో చిత్తు చేసి ప్లే రేసులో నిలిచింది. మొదట డుప్లెసిస్ సేన 241 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. తొలి అర్ధ భాగంలో దానిని కాపాడుకోవడానికి ఆర్సీబీ బౌలర్లు నానా అవస్థలు పడ్డారు. ఛేదనలో పంజాబ్ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 114 పరుగులు చేసింది. దీంతో హోరాహోరీ పోరు తప్పదనిపించింది. ఆ సమయంలో కరణ్ శర్మ(2 వికెట్లు) మ్యాచ్ మలుపు తిప్పాడు.

రోసో జోరు

ఎదుట కొండంత లక్ష్యం ఉన్నప్పటికీ.. పంజాబ్ బ్యాటర్లు వెనక్కి తగ్గలేదు. ప్రభసిమ్రాన్ సింగ్(6) త్వరగా ఔటైనా.. జానీ బెయిర్‌స్టో (16 బంతుల్లో 27 పరుగులు), రిలీ రోసో(61; 27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) జోడి ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. ఎడా పెడా బౌండరీలు బాదేస్తు స్కోర్ ను పరుగులు పెట్టించారు. వీరిద్దరి ధాటికి పంజాబ్ తొలి 5 ఓవర్లలోనే 61 పరుగులు చేసింది. మ్యాచ్ ఆర్సీబీ చేతుల నుంచి చేజారుతున్న సమయంలో బెయిర్‌స్టోను లాకీ ఫెర్గూసన్ వెనక్కి పంపాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన‌ శశాంక్ సింగ్(37) ఎప్పటిలానే మెరుపులు మెరిపించాడు. దీంతో మరోసారి మ్యాచ్ పంజాబ్ వైపు మళ్లింది.

ఆ సమయంలో బాల్ చేతికందుకున్న కరణ్ శర్మ వరుస ఓవర్లలో రోసో(61), జితేష్ శర్మ (5)లను పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్ లోనే లివింగ్‌స్టోన్(0)ను స్వప్నిల్ సింగ్ ఔట్ చేయడంతో.. ఆర్సీబీ డగౌట్‌లో నవ్వులు కనిపించాయి. అనంతరం కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌ దెబ్బకు శశాంక్ (37) రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ పంజాబ్ చేతుల నుంచి చేజారింది. చివరలో అశుతోష్ శర్మ(8), సామ్ కర్రన్ (22) నిరాశ పరిచారు. 17 ఓవర్లలో 181 పరుగుల వద్ద కింగ్స్ ఆలౌట్ అయ్యారు.

బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, లాకీ ఫెర్గూసన్ 2, కర్ణ్ శర్మ 2, స్వప్నిల్ సింగ్ 2 వికెట్లు తీసుకున్నారు.

కోహ్లీ స్ట్రైక్ రేట్ 190+

అంతకుముందు బ్యాటర్లు రాణించడంతో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(92; 46 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రజత్ పాటిదార్(23 బంతుల్లో 55 పరుగులు), కామెరాన్ గ్రీన్(27 బంతుల్లో 46 పరుగులు*) చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీసుకోగా.. క‌వెర‌ప్ప 2, అర్షదీప్ సింగ్, సామ్ కరన్ చెరో వికెట్ పడగొట్టారు.