- ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) శనివారం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రూల్స్‌కు విరుద్ధంగా నిర్వహిస్తున్న 144 మెడికల్ షాపులను గుర్తించిన అధికారులు, వాటికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం రూల్స్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీఏ డైరెక్టర్ జనరల్ హెచ్చరించారు. మందుల విక్రయాల్లో అక్రమాలు జరిగినా, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో డ్రగ్స్ తయారీ వంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా ప్రజలు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. ముఖ్యంగా నార్కోటిక్, సైకోట్రోపిక్ మందుల అక్రమ విక్రయాలపై డీసీఏ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల అమ్మకాలు..
తనిఖీల్లో భాగంగా అధికారులు పలు లోపాలను గుర్తించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే పవర్ ఫుల్ మందులు విక్రయిస్తున్నట్లు, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అందుబాటులో లేకున్నా మందులు అమ్ముతున్నట్లు గుర్తించారు. అలాగే, మందుల అమ్మకపు బిల్లులు ఇవ్వకపోవడం, స్టాక్ కొనుగోలు బిల్లులు చూపించకపోవడం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ రిజిస్టర్లు, షెడ్యూల్ హెచ్1 డ్రగ్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి లోపాలు తనిఖీల్లో బయటపడ్డాయి. ఫ్రిజ్‌లో ఉంచాల్సిన మందులను సాధారణ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తున్నట్లు అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేశారు.
