సాజిద్ ఖాన్‌ను తొలగించమన్నందుకే బెదిరింపులు : డీసీడబ్ల్యూ చీఫ్

సాజిద్ ఖాన్‌ను తొలగించమన్నందుకే బెదిరింపులు : డీసీడబ్ల్యూ చీఫ్

తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. సినీ నిర్మాత సాజిద్ ఖాన్‌ను బిగ్ బాస్ లోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించిన ఆమె.. ఇటీవలే ఆయన్ను షో నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేఖ రాశారు. దీంతో తనకు ఈ బెదిరింపులు వస్తున్నాయని స్వాతి మాలీవాల్ చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె పోలీసులను కోరారు. తాను ఆ లేఖ రాసినప్పటి నుంచే తనకు ఇన్సాస్టాగ్రామ్ లో రేప్ బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశానన్న ఆమె.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేయమని కోరినట్టు తెలుస్తోంది. దీంతో పాటు దీని వెనక ఉన్న వారిని అరెస్ట్ చేయండని స్వాతి డిమాండ్ చేశారు. 

దేశంలో మీటూ ఉద్యమం సమయంలో సాజిద్ ఖాన్ పై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో ఆయన్ను 2018లో ఇండియన్ ఫిల్మ్‌ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌(ఐఎఫ్‌టీడీఏ) నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న హిందీ బిగ్ బాస్ 16 సీజన్ లో సాజిద్ ఖాన్ పాల్గొనడంపై స్వాతి మాలీవాల్ స్పందించారు. మీటూ ఉద్యమ కాలంలో ఆయనపై 10మంది మహిళలు కంప్లైంట్ చేశారని, ఆయన్ను షో నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే కేంద్రమంత్రికి లేఖ రాశారు.