న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు సంబంధించి హైకోర్టు మహిళా న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ కేజ్రీవాల్ సహా పలువురు అగ్రనేతలకు ఢిల్లీ హైకోర్టు.. క్రిమినల్ కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
నాలుగు వారాల్లోగా సమాధానాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఆప్ నేతలు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లతో పాటు మరికొందరిని జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ రవీందర్ దుడేజాలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ తీరును కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలు తప్పుపట్టారు. ఆమె గురించి ఆప్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు, ఎడిట్ చేసిన వీడియోలు పెట్టారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ.. ఆప్ నేతలు తనతోపాటు కోర్టు ప్రతిష్టను దిగజార్చేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ చర్యలకు దిగారు.
ఈ పరిణామాల నేపథ్యంలో జస్టిస్ స్వర్ణ కాంత శర్మ.. సీబీఐ అప్పీల్ విచారణను మరో బెంచ్‌కు బదిలీ చేశారు. అలాగే, విడుదలను సవాల్ చేస్తూ సీబీఐ వేసిన అప్పీల్‌పై వచ్చే సోమవారంలోగా సమాధానం ఇవ్వాలని ఆప్ నేతలకు స్పష్టం చేసింది.
