ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోం

ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోం

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ పై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ స్కీమ్​ను సవాల్ చేస్తూ ఫైల్ అయిన  పిటిషన్లపై చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. విచారణ ముగిసే వరకూ అగ్నిపథ్ పై స్టే విధించాలని పిటిషనర్ల తరఫు లాయర్ ఒకరు కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని, వాదనలు పూర్తయ్యే వరకు వింటామని చెప్పింది.

‘‘మేము ఇప్పుడే స్టే విధించలేం. ఈ కేసులో మీరు గెలిస్తే, అప్పుడు స్టే వస్తుంది” అని తెలిపింది. ప్రస్తుతం అగ్నిపథ్ కింద జరుగుతున్న నియామకాలన్నీ కోర్టు తీర్పుకు లోబడి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని లాయర్ ప్రశాంత్ భూషణ్ కోరారు. దానికి ప్రత్యేకంగా ఆదేశాలు అక్కర్లేదని, అది ఎల్లప్పుడూ ఉంటుందని కోర్టు పేర్కొంది. అగ్నిపథ్​కు సంబంధించి వివిధ అంశాలపై పిటిషన్లు ఫైల్ అయ్యాయని, వీటికి రిప్లై పిటిషన్లు ఫైల్ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.