139 మంది అత్యాచారం కేసు: బాధితురాలకు న్యాయం జరగాలంటూ డిమాండ్

139 మంది అత్యాచారం కేసు: బాధితురాలకు న్యాయం జరగాలంటూ డిమాండ్

హైదరాబాద్: 139 మంది తనపై అత్యాచారం చేశారని హైదరాబాద్‌లో ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు చేసిన ఫిర్యాదు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. బాధిత మహిళకు న్యాయం జ‌ర‌గాలంటూ ప‌లు ప్ర‌జా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గురువారం.. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జ‌రిగింది. ఈ స‌మావేశంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి కుమార్ మాట్లాడుతూ…ప్రతి విషయంలో ట్విట్టర్ లో స్పందించే కేటీఆర్ గిరిజన మహిళపై జరిగిన సంఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్ర‌శ్నించారు. బాధితురాలిని పశువుల కన్నా హీనంగా హింసించారని, ఒంటినిండా గాయాలు చేశారని అన్నారు. ఈ కేసు వెనుక సినిమా యాక్టర్లు, రాజకీయ పెద్దలు, ప్ర‌ముఖులు వున్నార‌ని, బయటకు చెప్తే అత్యాచారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెడుతామ‌ని బాధితురాలిని బెదిరించారన్నారు. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

జనరల్ సెక్రెటరీ రాజు మాట్లాడుతూ.. బాధితురాలు గిరిజన మహిళ కాబట్టే పాల‌కులు వివక్ష చూపుతున్నార‌ని అన్నారు. 139 బడా బాబుల వెనకాల ప్రభుత్వం ఉంది కాబట్టే వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.వెంటనే వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలన్నారు. ఆమె ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని, ప్ర‌భుత్వం ఆమెకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని అన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాడుతామ‌ని అన్నారు.

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేద‌ని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ సంధ్య అన్నారు. ఈ స‌మావేశంలో పాల్గోన్న ఆమె.. 139 మందిలో ఇప్పటి వరకు పోలీసులు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేద‌న్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ జవాబుదారీగా పని చేయడం లేదని,లా అండ్ ఆర్డర్ వ్యవస్ట సరిగా పని చేయడం లేదన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు మహిళ సంఘాల జేఏసీ మద్దతుగా ఉంటుంద‌ని సంధ్య అన్నారు.

ప్రెస్ మీట్ లో బాధితురాలు వీడియో కాల్ లో మాట్లాడుతూ.. త‌నకు జారిగిన అన్యాయం ఇంకో అమ్మాయికి జరుగొద్దని ఆవేదన వ్యక్తం చేసింది. త‌న‌ ఫోటోలు, వీడియోలు బయటకి వస్తే త‌మ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందని, త‌ను కంప్లయింట్ చేసిన వారి నుండి త‌న‌కు హాని ఉందని వాపోయింది.

demanding justice for the victim of Tribal woman in 139 men rape case