అర్ధరాత్రి పేదల ఇండ్లు, గుడిసెలు కూల్చివేత

అర్ధరాత్రి పేదల ఇండ్లు, గుడిసెలు కూల్చివేత

ఖైరతాబాద్, వెలుగు: అర్ధరాత్రి అధికారులు ఇండ్లు , గుడిసెలు కూల్చేశారంటూ ఖైరతాబాద్ సెగ్మెంట్ ఎర్రమంజిల్ లోని రామకృష్ణానగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. బాధితులు మాట్లాడుతూ.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల టైమ్ లో 50 మందికి పైగా పోలీసులు, రెవెన్యు అధికారులు, 20 మంది లేబర్లు ఎర్రమంజిల్ లోని రామకృష్ణానగర్ కు చేరుకున్నారు. ఇంట్లో నిద్రపోతున్నవారిని బలవంతంగా లేపి బయటకు తీసుకొచ్చారు. ఇండ్లు ఖాళీ చేయించి తర్వాత  వాటిని కూలగొట్టారు. కొన్ని గుడిసెలను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న పీసీసీ ప్రధాన కార్యదర్శి, స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అధికారులను అడ్డుకునే యత్నం చేశారు. అర్ధరాత్రి దొంగల్లా వచ్చి ఇండ్లను ఎలా కూలుస్తారని అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమెకు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.

పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఎస్ ఆర్ నగర్ పీఎస్​కు తరలించారు. సాయంత్రం విడిచిపెట్టారు. విజయా రెడ్డి మాట్లాడుతూ.. నిమ్స్ అభివృద్ధి పేరుతో ఐసీ, ఐపీ క్వార్టర్స్ ను కూల్చడం అన్యాయం అన్నారు. వారికి పొజిషన్ సర్టిఫికెట్, కరెంటు బిల్లులు, నల్లా బిల్లులు ఉన్నప్పటికీ.. ఇలా దౌర్జన్యం చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. మరోవైపు  ఇండ్లు, గుడిసెలు  కూల్చివేయడంతో అక్కడివారంతా బోరున విలపించారు. ‘1976లో మా తల్లిదండ్రులకు అప్పటి ఉమ్మడి సీఎం వెంగళ్ రావు ఇక్కడ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆయనే స్వయంగా వచ్చి మా ఇంటిని ఓపెన్ చేశారు.

50 ఏండ్ల నుంచి ఇక్కడే ఉన్నం. ప్రభుత్వం ఇచ్చిన స్థలానికి లోన్ ద్వారా మొత్తం డబ్బు కట్టినం. కూల్చివేత విషయంపై ఒక్క మాట చెప్పలేదు. నోటీసులు ఇవ్వలేదు. అర్ధరాత్రి వచ్చి ఇల్లు కూలగొట్టిన్రు... ఇది అన్యాయం.. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాల్నో తెలియడం లేదు’ అని స్థానికురాలు రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు.