ఆసిఫాబాద్​లో నీట్ పరీక్ష పేపర్ తారుమారు

ఆసిఫాబాద్​లో నీట్ పరీక్ష పేపర్ తారుమారు
  • ఒక సెట్​కు బదులు మరో సెట్ ఇచ్చిన నిర్వాహకులు
  • ఆందోళనలో 300 మంది
  • సెంటర్​లో ఆర్డీవో విచారణ 
  • విద్యార్థుల ప్రశ్నాపత్రాన్ని  పరిగణలోకి తీసుకుంటామని  ఎన్​టీఏ చెప్పిందన్న ఆఫీసర్​ 

ఆసిఫాబాద్, వెలుగు: నీట్ పరీక్షలో అధికారుల నిర్లక్ష్యం 300 మంది స్టూడెంట్స్ భవిష్యత్​ను ప్రశ్నార్థకం చేసింది. రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలో భాగంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్​లో ఎగ్జామ్​సెంటర్​ఏర్పాటు చేశారు. ఇక్కడ 323 మంది విద్యార్థులకు 299 మంది పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు నేషనల్ ​టెస్టింగ్​ఏజెన్సీ అందించిన పేపర్ ఒకటైతే.. ఇక్కడి స్టూడెంట్స్ కు వేరే పేపర్ ఇచ్చారు. పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వెళ్లిన స్టూడెంట్స్​ ఫ్రెండ్స్ తో పరీక్ష గురించి చర్చిస్తుండగా విషయం బయటపడింది. అంతేగాక యూట్యూబ్ సహా ఆన్​లైన్​లో పేపర్ కీ చూసే సమయంలో తేడా ఉండడంతో విద్యార్థులు పొరపాటు జరిగిందని గుర్తించారు. 

పొరపాటు నిజమే : కో ఆర్డినేటర్ నరేందర్​

జరిగిన పొరపాటుపై పరీక్షా కేంద్రం కో ఆర్డినేటర్ నరేందర్ వివరణ కోరగా ఎస్​బీఐ, కెనరా బ్యాంక్ ల నుంచి పరీక్షా పత్రాలు తెచ్చామని, అందులో ఎస్​బీఐ నుంచి తెచ్చిన పేపర్​కు బదులు కెనరా బ్యాంకు నుంచి తీసుకువచ్చిన పేపర్ విద్యార్థులకు ఇవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో లోకేశ్వరరావు సోమవారం పరీక్షా కేంద్రానికి వెళ్లి విచారణ జరిపారు. పరీక్షా కేంద్రంలో నిర్వాహకుల తప్పిదం వల్లే ప్రశ్నాపత్రం మారిందని నిర్ధారణకు వచ్చారు. 

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఆర్డీవో

విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్డీవో  స్పష్టం చేశారు. ఎన్​టీఏ అధికారులతో మాట్లాడామని, విద్యార్థులు రాసిన ప్రశ్నాపత్రాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారని తెలియజేశారు. విద్యార్థులు సోమవారం కలెక్టర్​ వెంకటేశ్​ ధోత్రేను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.