దేవాదుల..2027నాటికి పూర్తవ్వాల్సిందే.. పనుల్లో ఇకపై ఎలాంటి ఆలస్యం చేయొద్దు: మంత్రి ఉత్తమ్

దేవాదుల..2027నాటికి పూర్తవ్వాల్సిందే.. పనుల్లో ఇకపై ఎలాంటి ఆలస్యం చేయొద్దు: మంత్రి ఉత్తమ్
  • అవసరమైన 2,659 ఎకరాలను వేగంగా సేకరించాలి
  • పనిచేయని కాంట్రాక్టర్ల పనులను రద్దు చేసి కొత్తోళ్లకు ఇవ్వాలి
  • మంత్రులు సీతక్క, పొన్నం​లతో కలిసి రివ్యూ

హైదరాబాద్, వెలుగు: దేవాదుల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 డిసెంబర్​ 31 నాటికి పూర్తి చేసి తీరాలని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తేల్చిచెప్పారు. ప్రాజెక్టు పనులను ఆలస్యం చేయొద్దని, ఈ విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు డెడ్​లైన్​ను దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలని సూచించారు. శనివారం సెక్రటేరియెట్​లో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లా నాయకులతో కలిసి అధికారులతో ప్రాజెక్టుపై ప్యాకేజీలవారీగా ఆయన రివ్యూ చేశారు.

పనుల పురోగతి, ఆర్థిక పరిస్థితులు, భూసేకరణ, కోర్టు కేసులు, పెండింగ్​ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్, ఆయకట్టు తదితర అంశాలపై చర్చించారు. 10 జిల్లాల్లోని 5.57 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, పనులకు అడ్డుగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబాబాద్, ములుగు, జయశంకర్​ భూపాలపల్లి, కరీంనగర్​ జిల్లాలకు సాగునీరందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 2004లో రూ.6,016 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఖర్చు ఇప్పుడు.. రూ.18,400 కోట్లకు పెరిగిందన్నారు. నిర్మాణ ఖర్చులు, జీఎస్టీ, భూసేకరణ పరిహారం, కరెంటు బిల్లులు, ద్రవ్యోల్బణం, రివైజ్డ్​ డిజైన్ల వంటి కారణాల వల్లే అంచనా వ్యయం పెరిగిందన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు కోసం రూ.14,422 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.3,978 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొన్నారు. మొత్తంగా ప్రాజెక్టు పనులు 87.70 శాతం పూర్తయ్యాయన్నారు.   

భూసేకరణ వేగవంతం చేయాలి

ప్రాజెక్ట్​లో కెనాల్​ లైనింగ్​ పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు ఇంకా పూర్తి కాలేదని, భూసేకరణ ఆలస్యమవుతుండడంలో పనులు లేట్​ అవుతున్నాయని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. ఫేజ్​1లోని ప్యాకేజ్​ 45 పనులు మొత్తం పూర్తికాగా.. ప్యాకేజీ 46లో 97 శాతం పనులయ్యాయని, బొల్లికుంట వద్ద 700 మీటర్ల కెనాల్​ లైనింగ్​ పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. కోర్టు కేసు కారణంగా ఆ పనులు జరగడం లేదన్నారు. ఫేజ్​ 2లో హెడ్​వర్క్స్, పంప్​హౌస్​లు, పైప్​లైన్లు పూర్తయ్యాయన్నారు. భూసేకరణ సమస్యలతో తపాస్​పల్లి, అశ్వారావుపల్లి, చీటకోడూరు డిస్ట్రిబ్యూటరీల పనులు జరగడం లేదన్నారు.

ఫేజ్​ 3తోనే అసలు సమస్య ఉందన్నారు. దేవాదుల కింద 3.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని, మరో 2.23 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉందని చెప్పారు. సూర్యాపేట, ములుగు, వరంగల్​ రూరల్, సిద్దిపేట జిల్లాలకు నీళ్లు రావడం లేదన్నారు. అందువల్ల భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 34,622 ఎకరాలకుగానూ 31,963 ఎకరాలు ఇప్పటికే సేకరించామని.. మరో 2,659 ఎకరాలు సేకరించాల్సి ఉందని అధికారులు చెప్పగా.. ఆ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. 

ఆయకట్టు లోంచి 39,651 ఎకరాలు తొలగించాలి.. 

ప్రతిపాదిత ఆయకట్టులో 39,651 ఎకరాలు పట్టణీకరణ వల్ల అభివృద్ధి చెందాయని, వాటిని పనుల జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు మంత్రికి వివరించారు. ఆ ప్రక్రియ మరో పది రోజుల్లో పూర్తవుతుందని, తద్వారా అనవసర ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. పనులు ఆగిపోయిన ప్రాంతాలను గుర్తించి వెంటనే క్లోజర్​ ఆర్డర్స్​ ఇవ్వాలని, అవసరమైన చోట మళ్లీ టెండర్లను పిలవాలని మంత్రి ఉత్తమ్​ ఆదేశించారు. కాంట్రాక్టర్లు పనిచేయనిచోట పనులు క్లోజ్​ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ బలరాం నాయక్​, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మందుల సామేల్, మురళీ నాయక్, పల్లా రాజేశ్వర్​ రెడ్డి, మాధవ​ రెడ్డి, కేఆర్​ నాగరాజ్, సీఎస్​ రామకృష్ణా రావు, ఇరిగేషన్​ సెక్రటరీ ఇ. శ్రీధర్​ తదితరులు పాల్గొన్నారు.