‘దేవిపోత’.. జీవితానుభవాలను ఈ తరం కోసం ఎదలోతుల్లోంచి ఎత్తిపోస్తున్నకథ

‘దేవిపోత’.. జీవితానుభవాలను ఈ తరం కోసం ఎదలోతుల్లోంచి ఎత్తిపోస్తున్నకథ

మనిషి అంటేనే అనుభవాల పుట్ట. ఒక తరం అనుభవాలు, తర్వాతి తరానికి పాఠాలైతయ్​. ఆ పాఠాలతోటే మానవ పురోగతికి బాటలు వడ్తయ్​. అలాంటి అనుభవ పాఠాలను తమ వరకే పరిమితం చేసేవాళ్లు కొందరైతే, వాటిని జాగ్రత్తగా రికార్డు చేసి తర్వాతి తరాలకు అందించేవాళ్లు ఇంకొందరు. ఈ పుస్తక రచయిత పెంటయ్య సార్​ రెండో కోవకు చెందుతరు. ఈ రచయిత పూర్వ కరీంనగర్​ జిల్లాలో గొప్ప విద్యావేత్త. ఉద్యోగ జీవితంలో మ్యాథ్స్​ టీచర్​గా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ మాస్టారు, రిటైర్​మెంట్​ తర్వాత పుస్తకాలు రాస్తున్నరు. కొత్త పుస్తకం ‘దేవిపోత’ ద్వారా తన జీవితానుభవాలను ఈ తరం కోసం ఎదలోతుల్లోంచి ఎత్తిపోస్తున్నరు. 70 ఏండ్ల జీవిత కాలంలో తాను విన్న, చూసిన, చదివిన, జ్ఞాపకం ఉన్న సంఘటనలను.. చిన్న చిన్న కథలుగా, ముచ్చట్లుగా పుస్తకంలో రాసినట్లు పెంటయ్యసార్​ చెప్పుకున్నరు.

సాంకేతిక యుగంలో బతుకుతున్న నేటి తరానికి సాటి మనుషులకంటే కంప్యూటర్లు, స్మార్ట్​ఫోన్లతోనే ఎక్కువ కనెక్టివిటీ ఉంటున్నది. అందుకే నేటితరం అనుభవాలన్నీ స్మార్ట్​ఫోన్​ అనుభవాలే అని చెప్పక తప్పదు. అనుమానమస్తే గూగులమ్మను, ఆకలేస్తే స్విగ్గీని అడుక్కోవడం.. ఆనందమో, బాధో కలిగినప్పుడు ఫేస్​బుక్​లోనో, ఇన్​స్టాలోనో పోస్టులు పెట్టి లైకుల కోసం గెలుక్కోవడం.. పొద్దస్తమానం రీల్స్​ చూస్తూ గడిపేయడంతోనే సరిపోతున్నది. వాళ్ల బుర్రతోనే వాళ్లకు అవసరం లేనంత టెక్నాలజీలో బతుకుతున్న మనుషులకు ఇతరుల అనుభవాలతో ఏం పని? అందుకే రచయిత ముందుమాటలో ఇదే విషయం చెప్తూ – తనలాంటి వాళ్ల అనుభవ జ్ఞానం.. తలమీది ఎంటికలన్నీ ఊసిపోయినంక దొరికే కొత్త దువ్వెన లాంటిదంటడు. ఆ దువ్వెనతో తన జుట్టును దువ్వుకోలేనని, ఎదుటివారి వెంట్రుకలు దువ్వుదామంటే ఒప్పుకోరని చమత్కరిస్తడు. అలాగని స్టూడెంట్లకు పాఠాలు, సమాజానికి బతుకుపాఠాలు చెప్పకుండా ఊకుంటే ఊహించలేని నష్టం జరుగుతుందని హెచ్చరిస్తడు. ఈ క్రమంలో పుస్తకం ముందుమాటలో ​చెప్పిన ‘నాలుగు కోతుల కథ’ ఆలోచింపజేస్తది.

ఓ మారుమూల అటవీ గ్రామంలోని నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రచయిత నిజానికి ఓ మట్టి మనిషి. పొలం పనులు చేసుకుంటూ చదువుకొని, లెక్కల టీచర్​గా ఉద్యోగం సంపాదించి, విద్యాపర్యవేక్షణాధికారిగా విరమణ చేసిండు. ఈ జీవన గమనంలో ఆయనకు ఎదురైన అనుభవాలే ఈ ‘దేవిపోత’ ముచ్చట్లు. విధి నిర్వహణలో భాగంగా విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, అధికారులతో పాటు ఆయా గ్రామాల్లోని వివిధ రకాల వ్యక్తులతో తనకు కలిగిన అనుభవాలను తెలంగాణ మాండలికంలో చాలా సహజంగా చెప్పిండు.  విద్యాధికారిగా రిటైరయ్యాక తనలోని రైతు మళ్లీ నిద్రలేవడంతో ఇంటి మీద మిద్దెతోట ఏర్పాటుచేసిండాయన. ఓ మిత్రుడి సలహా మేరకు తన మిద్దె తోట అనుభవాలను  పదిమందికి తెలియజేయాలనే ఆలోచనతో ఈ ముచ్చట్లను రాయడం మొదలుపెట్టి ఇప్పుడు పుస్తక రూపం ఇచ్చిండు. 

ఓ తాత, మనవడు మంచంలో పడుకున్నప్పుడు మీదికెల్లి ఓ కొంగల గుంపు పోతందట. వాటిని లెక్కపెట్టేందుకు ప్రయత్నించి, విఫలమైన మనుమడు ఎన్ని కొంగలున్నయని తాతను అడుగుతడట. అప్పుడా త ‘అన్ని, అన్ని, అన్నిట్ల సగం, సగంల సగం, నాతో కలిసి నూరు..’ అని చెప్తడట. ఇంతకీ ఆ కొంగలు ఎన్నో మీరు చెప్పండి’ అని పిల్లల్ని అడిగి, అందరూ కలిసి ఆ లెక్క సాధించిన విధానాన్ని రచయిత చాలా చక్కగా చెప్పిండు.

మనిషి మనిషిని ప్రేమించే ఒక సామరస్య పూర్వక సమాజ నిర్మాణం గుణాత్మక విద్య ద్వారానే సాధ్యపడుతుందని రచయిత అంటడు. సాటి మనుషులను మాత్రమే కాకుండా చెట్టు, చేను పుట్ట, గుట్ట, ప్రాణులన్నిటిని సమానంగా ప్రేమించే తరం రావాలంటడు. ఇందుకోసం ముందుగా టీచర్​ వృత్తిపై సమాజంలో ఉన్న దురభిప్రాయం పోవాలంటడు. లేదంటే ఈ బడుల నుంచి విలువలు లేని సమాజాన్ని పట్టిపీడించే దొంగలు బయటకు వస్తరని పెంటయ్యసార్​ హెచ్చరిస్తడు.

మిద్దె తోట పెంపకంలో తనకు కలుగుతున్న కష్టనష్టాలకు కారణాలేంటో కనుక్కునే ప్రయత్నం కూడా రచయిత చాలా సీరియస్​గా చేసిండు. కోతులు మిద్దె తోట మీద దాడి చేసి, నాశనం చేసిన విషయాన్ని చెప్తూ గతంలో ఎవరి పశువులైనా చేన్లు, చెలకల మీద దాడి చేస్తే ఆ పశువులను బందెల దొడ్లె తోలి పరిహారం వసూలు చేసే వాళ్లని, ఇప్పుడు అడవులను, గుట్టలను సర్కారు నాశనం చేయడం వల్లే  కోతులు ఇలా ఇండ్ల మీద పడుతున్నయని, ఇప్పుడు తాను ఎవరిని బందెల దొడ్లో వేయాలని సూటిగా ప్రశ్నిస్తడు. వీటితో పాటు పలు సామాజిక అంశాలను కూడా రచయిత చర్చకు పెట్టిండు. తెలంగాణ పల్లెల్లో ఒకప్పుడు కింది కులాల బతుకులు, వారి సామాజిక స్థితి ఎంత దీనంగా ఉండేదో, ఆ పరిస్థితిని మార్చేందుకు మావోయిస్టులు చేసిన కృషి ఎలాంటిదో ‘సామాజిక న్యాయం’  ముచ్చట ద్వారా  చెప్పిండు. అప్పట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల పేర్లను రేషన్​కార్డుల్లో ‘రాజుగాడు, ఎల్లిగాడు, పోషిగాడు’ అని నమోదుచేసేవాళ్లట! మావోయిస్టులు ఓ ఊరి పట్వారి కణతపై గురిపెట్టి మరీ ఆ పేర్లను ‘రాజయ్య, ఎల్లయ్య, పోషయ్య’గా మార్చిన తీరును తన జ్ఞాపకంగా చెప్తుంటే ఆశ్చర్యం వేస్తది. 

రెండో ప్రపంచ యుద్ధకాలంలో వచ్చిన ఒక యూరోపియన్ కథ ద్వారా ఆర్థికమాంద్యం గురించి సింపుల్​గా చెప్పిన తీరు బాగున్నది. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన నిర్వాసితుల కష్టాలను తోట రాజలింగం అనే పెద్దమనిషి కేస్​స్టడీగా తీసుకొని చెప్పిండు. భూమికి, రైతుకు పేగుబంధం ఉంటది. అందుకే ప్రాజెక్టుల కోసం ఎక్కడ పబ్లిక్​ హియరింగ్​ జరిగినా నిర్వాసితులు భూమికి బదులు భూమి అడుగుతరు. కానీ సర్కారు మాత్రం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం వల్ల రైతుల పరిస్థితి ఎంతగా దిగజారుతున్నదో ‘అరచేతిల ఐసు ముక్క’ ద్వారా రచయిత కండ్ల కట్టిండు. 

మనిషికి చదువు, జ్ఞానం అవసరమని, లేదంటే ​సామాన్యమైన విషయాలపై కూడా అవగాహన ఉండదన్న సంగతిని ‘‘ప్రేమా పేరాశ’’ ద్వారా చక్కగా వివరించిండు. ఒకప్పుడు జొన్నలు, నువ్వులు, కందులు, గోధుమలు పండే నేలల్లో ఇప్పుడు కేవలం వరి, పత్తి ఎందుకు పండుతున్నయో, ఆ పంటలపై పిచికారీ చేసే రకరకాల పురుగుమందుల వల్ల  పర్యావరణ విధ్వంసం... తద్వారా జీవన విధ్వంసం ఎలా జరుగుతుందో ఓ మాస్టారుగా మనందరికీ హెచ్చరిక చేసిండు. 

- చిల్ల మల్లేశం 
9490700060