పోలీస్ కమిషనరేట్లు, హద్దులపై డీజీపీ రివ్యూ

పోలీస్ కమిషనరేట్లు, హద్దులపై డీజీపీ రివ్యూ
  • హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సహా గ్రేటర్ సీపీలతో భేటీ
  • హౌస్​ సర్వెంట్ల డేటాబేస్​ రెడీ చేయాలని ఆదేశం
  • సేవల్లో టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వలని సూచన

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌‌ కమిషనరేట్ల పరిధులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ సేవలపై డీజీపీ సీవీ ఆనంద్‌‌ దృష్టి పెట్టారు. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయెల్, ఇంటెలిజెన్స్ చీఫ్‌‌ విజయ్‌‌కుమార్ సహా పోలీస్ ఉన్నతాధికారులతో సోమవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమీక్షలో ఫ్యూచర్ సిటీ కమిషనర్ సహా గ్రేటర్‌‌‌‌లోని నాలుగు కమిషనరేట్ల సీపీలు పాల్గొన్నారు.

కమిషనరేట్ల పరిధులపై కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్ల పరిధితో పాటు సరిహద్దు గ్రామాల విభజన, జ్యూరిస్డిక్షన్ సంబంధిత అంశాలపై ఆయా పోలీస్ కమిషనర్లను డీజీపీ ఆరా తీశారు. డివిజనర్లు, సర్కిళ్లు, జోన్లు, గ్రామాల పునర్విభజన వంటి అంశాలు అన్ని శాఖలకు అనుకూలంగా ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ఈ సందర్భంగా డీజీపీ పలు సూచనలు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా నేపాల్‌‌కు చెందిన వ్యక్తులు హౌస్ సర్వంట్స్‌‌కు సంబంధించిన నేరాలపై ఆరా తీశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా డొమెస్టిక్ సర్వెంట్స్‌‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన డేటా బేస్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్ 

పోలీస్ సేవల్లో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీ సూచించారు. ‘తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్–యూజింగ్ టెక్నాలజీ’ అనే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. ఏఐ ఆధారిత పోలీసింగ్, డ్రోన్స్, హెచ్‌‌ఆర్‌‌ఎంఎస్, డేటా ఇంటెలిజెన్స్, స్మార్ట్ అప్లికేషన్ల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. సీసీటీఎన్‌‌ఎస్ 2.0 అమలు, సీఐడీ వ్యవస్థ బలోపేతం, మాన్యువల్ ప్రక్రియల ఆధునీకరణ, భవిష్యత్ కార్యాచరణలపై కూడా చర్చించారు.

టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ ద్వారా కోర్ అప్లికేషన్లు, టీజీ కాప్స్ వ్యవస్థ వినియోగంపై పటిష్ట చర్యలు తీసుకోవలన్నారు. ముఖ్యంగా డయల్-100, రౌడీ షీటర్లు, వాహనాల సెర్చింగ్, హిస్టరీ షీటర్ల డేటా వంటి అంశాలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వేగంగా అందుబాటులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు.

మ్యాన్‌‌పవర్ మేనేజ్‌‌మెంట్, వెహికల్ ఆడిట్, సిబ్బంది వినియోగం, ట్రాఫిక్ మేనేజ్‌‌మెంట్ వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో ట్రాఫిక్ మేనేజ్‌‌మెంట్ అండ్ రోడ్ ట్రాన్స్‌‌పోర్ట్ బ్యూరోతో పాటు కల్తీ ఆహారం కట్టడికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించారు.