డయాబెటెక్.. ఆటోమెటిక్​గా ఇన్సులిన్​ని బాడీలోకి పంప్​ చేసే డివైజ్​లు

డయాబెటెక్.. ఆటోమెటిక్​గా ఇన్సులిన్​ని బాడీలోకి పంప్​ చేసే డివైజ్​లు

వాస్తవానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు 1922లోనే వచ్చాయి. తర్వాత కొన్నేండ్లకు వాటిని ఇంజెక్ట్​ చేసే విధానాల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. అయితే.. ప్రస్తుతం అవసరమైనప్పుడు ఆటోమెటిక్​గా ఇన్సులిన్​ని బాడీలోకి పంప్​ చేసే డివైజ్​లు కూడా మార్కెట్​లోకి వచ్చాయి. ఇవి చాలా చిన్న సైజులో ఉండే కంప్యూటరైజ్డ్ డివైజ్​లు. వీటిని నడుము చుట్టూ పెట్టుకోవచ్చు. జేబులో పెట్టుకోవచ్చు. ఆర్మ్​బ్యాండ్‌తో కట్టుకోవచ్చు. వీటిలో కూడా చాలా రకాల పంప్​లు ఉన్నాయి. కొన్ని పంపులు అవసరమైనప్పుడల్లా ఇన్సులిన్‌ని పంప్​ చేస్తాయి. కొన్నేమో మనం సెట్​ చేసి పెట్టుకున్న టైంలోనే పంపు చేస్తాయి. మరికొన్ని మాత్రం భోజనం చేసినప్పుడు, ఎక్కువగా శ్నాక్స్​ తిన్నప్పుడు మాత్రమే ఇన్సులిన్​ని పంప్​ చేస్తాయి.

పనిలో బిజీగా ఉండేవాళ్లకు ఇలాంటి డివైజ్​లు బెస్ట్​ ఛాయిస్​. ఇన్సులిన్​, సిరంజ్​ని రెడీ చేసుకుని జాగ్రత్తగా చూసుకుని షాట్​ ఇవ్వడం కంటే ఒక్క బటన్​ నొక్కడం చాలా ఈజీ. ఇలాంటి డివైజ్​లు ఒక్క బటన్​తో ఇన్సులిన్​ని బాడీలోకి పంప్​ చేస్తాయి.

కావాల్సినప్పుడు ఇస్తుంది:

షుగర్​ ఉన్న వాళ్లలో అవసరమైనంత ఇన్సులిన్​ ఉత్పత్తి కాదు. అందుకని బయటినుంచి ఇంజెక్షన్స్​ ద్వారా ఇన్సులిన్​ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. బాడీలో ఇన్సులిన్​ తగ్గిన ప్రతిసారి ఇంజెక్షన్​ తీసుకోవడం ఇబ్బందిగా ఉండేవాళ్ల కోసం తెచ్చిందే ఇన్సులిన్​ పంప్​. బాడీకి ఇన్సులిన్ అవసరమైనప్పుడు ఈ డివైజ్​కు ఉండే పంపు నుంచి ఇన్సులిన్​ని శరీరంలోకి పంపొచ్చు. దీనివల్ల రోజూ ఇంజెక్షన్​తో పొడుచుకునే బాధ తగ్గుతుంది. ఇన్సులిన్ పంపులు శరీరానికి అతుక్కొని ఉంటాయి. కాబట్టి, చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది.
వీటిని ఎవరైనా వాడొచ్చు. కానీ.. 400 కంటే ఎక్కువ షుగర్​ ఉన్నవాళ్లకు మాత్రమే వీటిని వాడాలని డాక్టర్లు చెప్తుంటారు. ఇన్సులిన్ పంపులోని ఒక ఛాంబర్​లో ఇన్సులిన్​ ట్యూబ్​లు ఉంటాయి. వాటి నుంచి వచ్చే ఒక చిన్న పైపుని చర్మానికి ఫిక్స్​ చేస్తారు. బాడీకి ఇన్సులిన్​ అవసరం ఉన్న ప్రతిసారి ఆ ఛాంబర్​ నుంచి ఇన్సులిన్​ బాడీలోకి వెళ్తుంది.

ఈ పంపు స్మార్ట్​ఫోన్ సైజులో ఉంటుంది. చిన్న టేపర్డ్ ట్యూబ్​ని బొడ్డు పక్కన, పిరుదులు, తొడ --లాంటి చోట పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పంపు శరీరానికి పెట్టుకున్నా రోజూ వారీ పనులు చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.