ముంబై: కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి సెలెక్షన్ ట్రయల్స్‌లోనే తాను ఫెయిలయ్యాయని బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. దాని ఫలితంగా మరింత ఎక్కువ శ్రమించాలనే తత్వం బోధపడిందని వెల్లడించాడు. ‘నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు.. ఇండియాకు ఆడాలన్నదే నా మనసులో ఉండేది. 11 ఏళ్ల వయసులో నా జర్నీ మొదలైంది. ఆ సమయంలో నేను తొలిసారి ఓ సెలెక్షన్ ట్రయల్స్‌కు వెళ్లా. కానీ సెలెక్టర్లు రిజెక్ట్ చేశారు. మరింత కష్టపడటంతో పాటు నా ఆటను మరింత మెరుగుపర్చుకోమని చెప్పారు. అప్పుడు చాలా నిరాశ చెందా. ఎందుకంటే బ్యాటింగ్ బాగా చేశానని నా నమ్మకం. కానీ నా అంచనాలకు తగ్గట్లుగా రిజల్ట్ రాలేదు. ఈ సంఘటన తర్వాత నా ఫోకస్, కమిట్‌మెంట్ మొత్తం ఆటపైనే పెట్టా. ఎంత వీలైతే అంత మెరుగుపడేందుకు తీవ్రంగా శ్రమించా. ఒకవేళ మన కలల్ని నిజం చేసుకోవాలంటే షార్ట్‌కర్ట్స్ ఉపయోగపడవనే అంశాన్ని గుర్తుంచుకోవాలి’ అని మాస్టర్ పేర్కొన్నాడు. తన క్రికెట్ జర్నీలో కుటుంబ సభ్యులు, కోచ్ రమాకాంత్ అచ్రేకర్ చాలా మద్దత్తిచ్చారన్నాడు. ఆటలో తన సక్సెస్‌కు మూల కారణం వీళ్లేనని చెప్పాడు. ‘నేను క్రికెట్‌లో ఇంతలా ఎదగడానికి నా కుటుంబం చాలా సాయం చేసింది. నా సోదరులు అజిత్, నితిన్ చాలా ప్రోత్సహించారు. నా పెద్ద సోదరి కూడా. నా లైఫ్‌లో తొలి క్రికెట్ బ్యాట్‌ను ఇచ్చింది ఆమెనే. పెళ్లి తర్వాత అంజలి, సారా, అర్జున్, అంజలి కుటుంబం కూడా నాకు వెన్నుదన్నుగా నిలిచింది. చివరగా కోచ్ రమాకాంత్ సర్ లేకుంటే నేను ఇలా ఉండేవాడిని కాదేమో’ అని ఈ మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.


