
ప్రేక్షకుల మైండ్‌సెట్‌కు తగ్గట్టుగా ఫిల్మ్ మేకర్స్ ఎడ్యుకేట్ అయితేనే సక్సెస్ వస్తుంది అంటున్నారు దిల్ రాజు. నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. ఈనెల 22న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఆయన ఇలా ముచ్చటించారు.
జీరో నుంచి హీరో అయిన ఒక కుర్రాడి లైఫ్ జర్నీ ఇది. అందులోని అందమైన ప్రేమకథలు, కమర్షియల్ యాంగిల్స్ అన్నీ కలిపితేనే ఈ సినిమా. బీవీఎస్ రవి ఇచ్చిన స్టోరీ ఐడియాకు తన స్టైల్లో సీన్స్, స్క్రీన్ ప్లే రాశాడు విక్రమ్ కుమార్. చైతూ ఎక్స్ ట్రార్డినరీగా నటించాడు. తనకి, విక్రమ్‌కి మధ్య ఉన్న కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. మూడు స్టోరీలున్నాయి కనుక ప్రేమమ్, ఆటోగ్రాఫ్‌లతో పోలుస్తున్నారు. కానీ అవి లవ్ స్టోరీస్. ఇది లైఫ్ స్టోరీ. ప్యాండమిక్ టైమ్‌లో నేను కూడా థాంక్యూ జర్నీని స్టార్ట్ చేశా. స్కూల్, కాలేజ్, ఆటోమొబైల్ రంగంలో హెల్ప్ చేసిన వారిని కలిశా. సినిమా రంగంలో థాంక్యూ జర్నీ కంటిన్యూ చేయాల్సి ఉంది. త్వరలోనే చేస్తా. తెలంగాణలో 100 ప్లస్ జీఎస్టీకి ఈ మూవీ టికెట్స్ అమ్ముతున్నాం. అదే మల్టీప్లెక్స్‌లో 150 ప్లస్ జీఎస్టీ. కానీ ఆంధ్రాలో 120 ప్లస్ జీఎస్టీ అని జీవో ఉంది కనుక అంతకు మించి తగ్గించలేం. ఇక ప్యాండమిక్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఈక్వేషన్స్, మైండ్‌సెట్స్ మారిపోయాయి. ప్రేక్షకులు చాలా ఎడ్యుకేట్ అయ్యారు. దాంతో అంతంతమాత్రం కంటెంట్ నచ్చట్లేదు. కాబట్టి మేము మారాల్సిన టైమ్ వచ్చింది.
ఇటీవల నిర్మాతలతో ఓ మీటింగ్ జరిగింది. దానిపై రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ అందులో ప్రధానంగా చర్చించింది మేము ఎడ్యుకేట్ కావాలనే విషయాన్నే. కంటెంట్ బాగుండాలి, కంఫర్టబుల్ టికెట్ రేట్స్ పెట్టాలి, ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమ్ చేయాలి అనేవి మా ముందున్న మూడు ఎజెండాలు. ఎవరు సినిమా చేయాలన్నా ఈ మూడింటితో ముందుకెళ్తున్నాం. ప్రేక్షకుల మైండ్‌సెట్‌కు తగ్గట్టుగా ఫిల్మ్ మేకింగ్ మార్చుకుంటున్నాం. ఓటీటీలో సినిమాను ఎన్ని వారాలకు రిలీజ్ చేయాలనేది కూడా చర్చిస్తున్నాం. అలాగే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం అనేది ఒకప్పుడు నిర్మాతల సమస్య మాత్రమే. ఇప్పుడది సినిమా ఇండస్ట్రీ సమస్య. డైరెక్టర్లకీ, హీరోలకీ కూడా విషయం అర్థమైంది. ప్రొడ్యూసర్ల గురించి హీరోలకు కన్సర్న్ ఉంటుంది. వాళ్లకీ అన్నీ తెలుసు. కాబట్టి వాళ్లందరినీ కూర్చోబెట్టి అడ్రస్ చేయాలి. సమస్యను అర్థమయ్యేలా చెబితే అందరూ సపోర్ట్ చేస్తారనే నమ్మకం ఉంది. కొత్త సినిమాలు స్టార్ట్ చేయడానికి ఇది సరైన సమయం కాదు. వచ్చే ఏడాది ప్రేక్షకుల మైండ్‌సెట్ ఏమిటో అంచనా వేసి, అందుకు తగ్గ కంటెంట్ ఉంటేనే మొదలుపెట్టాలి. నేనేతే 10 స్క్రిప్టులు పక్కనపెట్టేశా. స్టార్ట్ అవ్వాల్సిన రెండు షూటింగులను ఆపేశా.