సీన్​ రీకన్​స్ట్రక్షన్​ ఇలా జరిగింది

సీన్​ రీకన్​స్ట్రక్షన్​ ఇలా జరిగింది

చటాన్​పల్లి.. గత నెల 27న అర్ధరాత్రి ‘దిశ’ను నలుగురు రాక్షసులు పెట్రోల్​ పోసి కాల్చి చంపేసిన చోటు. సరిగ్గా పదిరోజులకు.. శుక్రవారం తెల్లవారుజామున అదే ప్రాంతంలో ఆ నలుగురు హతమయ్యారు. పోలీస్​ ఎన్​కౌంటర్​లో అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న జనం భారీగా తరలివచ్చి.. పోలీసులకు జిందాబాద్​లు కొట్టారు. పూలవర్షం కురిపించారు. దేశవ్యాప్తంగా యువతీయువకులు, మహిళలు రోడ్లమీదికి వచ్చి సంబురాలు జరుపుకున్నారు. సత్వర న్యాయం జరిగిందని హర్షం ప్రకటించారు.

గత నెల 29న దిశ కేసులో ఆరిఫ్​, నవీన్​, శివ, చెన్నకేశవులును అరెస్టు చేసిన పోలీసులు అటు తర్వాత విచారణ కోసం రిమాండ్​లోకి తీసుకున్నారు. గచ్చిబౌలికి వచ్చి తిరిగి శంషాబాద్​లోని ఇంటికి వెళ్తున్న వెటర్నరీ డాక్టర్​ ‘దిశ’ను నిందితులు అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్య చేయడం దేశం మొత్తాన్ని కదిలించింది. ‘జస్టిస్​ ఫర్​ దిశ’ పేరిట నిరసనలు హోరెత్తాయి. పార్లమెంట్​ను కూడా ఈ ఘటన కుదిపేసింది.

ఈ క్రమంలో సీన్​ రీకన్​స్ట్రక్షన్​ కోసం శుక్రవారం తెల్లవారుజామున నలుగురు నిందితులను ‘దిశ’ హత్య జరిగిన హైదరాబాద్​ నగర శివారులోని చటాన్​పల్లి అండర్​ బ్రిడ్జి వద్దకు తీసుకువెళ్లారు. ఇదే అదునుగా పారిపోయేందుకు ప్రధాన నిందితుడు ఆరిఫ్​ మిగతా ముగ్గురికి సైగ చేశాడు. వారంతా కలిసి పోలీసులపైకి రాళ్లు, కట్టెలు విసిరారు. ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసుల నుంచి తుపాకులు గుంజుకొని కాల్పులు జరిపారని, సరెండర్​ కావాలని చెప్పినా వినలేదని సీపీ సజ్జనార్ తెలిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.