‘పెద్ది’విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత..నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద గద్దె నిర్మాణం

‘పెద్ది’విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత..నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద గద్దె నిర్మాణం
  • పర్మిషన్ లేదంటూ కూల్చిన మున్సిపల్ సిబ్బంది
  • ఆందోళనకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి, వినోద్​కుమార్​
  • మధ్యాహ్నం విగ్రహప్రతిష్ఠాపనకు సిద్ధమైన బీఆర్‍ఎస్‍ నాయకులు
  • అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం, ఉద్రిక్తత

వరంగల్/నర్సంపేట, వెలుగు : వరంగల్​జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా సోమవారం ఉద్రిక్తత నెలకొంది. పట్టణ శివారు దండుగడ్డ ప్రాంతంలోని మెడికల్​కాలేజీ  ఎదుట పెద్ది విగ్రహ ఏర్పాటు కోసం గద్దె నిర్మించారు. అయితే విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేదంటూ మున్సిపల్ ఆఫీసర్లు ఆదివారం రాత్రి గద్దెను కూల్చివేశారు. 

విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ​రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​కుమార్​ ఆధ్వర్యంలో బీఆర్ఎస్​నాయకులు, కార్యకర్తలు సోమవారం గద్దెను పరిశీలించారు. అనంతరం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్దకు చేరుకొని మెయిన్​రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

ఈ సందర్భంగా ఎర్రబెల్లి పోలీసులతో మాట్లాడుతూ.. తాము రెండు రోజుల టైం ఇస్తున్నామని, గద్దెను కూల్చివేసింది ఎవరో చెప్పాలని డిమాండ్​ చేశారు. అనంతరం నల్లబెల్లిలో పెద్ది దశదిన కార్యక్రమానికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బీఆర్ ఎస్​ నాయకులు పెద్దసంఖ్యలో కూల్చివేసిన గద్దె వద్దకు చేరుకున్నారు.

 అప్పటికప్పుడు మేస్ర్తీలను పిలిపించి గద్దెను నిర్మించి, పెద్ది విగ్రహ ప్రతిష్ఠకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న నర్సంపేట ఏసీపీ రవీందర్​రెడ్డి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని బీఆర్​ఎస్ నాయకులతో చర్చించే ప్రయత్నం చేయగా వారు వినలేదు. ఈ క్రమంలోనే నాయకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే పెద్ది విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు వెనుదిరిగారు.