ఇదేం నిజాం రాజ్యం కాదు..జీహెచ్ఎంసీపై హైకోర్టు కామెంట్స్

ఇదేం నిజాం రాజ్యం కాదు..జీహెచ్ఎంసీపై హైకోర్టు కామెంట్స్
  • కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పేరుతో ఏళ్లుగా శ్రమ దోపిడీ చేస్తరా?
  • కాంట్రాక్టర్‌ ముసుగు తీస్తే కనబడేది ప్రభుత్వమే
  • జీహెచ్‌ఎంసీపై హైకోర్టు ఘాటు కామెంట్స్‌
  • ‘రెగ్యులరైజేషన్‌’ కేసులో కార్పొరేషన్‌ అప్పీలుపై అసంతృప్తి
  • 30 వేల మందిని రెగ్యులరైజ్‌ చేయడం కష్టమన్న నగర పాలక సంస్థ

హైదరాబాద్, వెలుగు:‘ఇదేం నిజాం రాజ్యం కాదు. ఔట్‌ సోర్సింగ్‌/కాంట్రాక్ట్‌ పద్ధతుల్లో ఏళ్ల తరబడి శ్రమ దోపిడీకి పాల్పడతరా? కాంట్రాక్టర్‌ ముసుగేసి రూల్‌ ఆఫ్‌ లా అమలు చేయబోమంటే కుదురదు. ముసుగు తీస్తే కనబడేది ప్రభుత్వమే. ఏండ్ల తరబడి ఔట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ను కొనసాగించడానికి వీల్లేదని ఉమాదేవి, జగ్జీత్‌సింగ్‌ కేసుల్లో సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. కాబట్టి జీహెచ్‌ఎంసీలో ఔట్‌ సోర్సింగ్‌ సిస్టమ్‌ చట్ట వ్యతిరేకమే అవుతుంది. రాష్ట్ర సర్కారు నుంచి ఆర్థిక సాయం పొందుతున్న జీహెచ్‌ఎంసీ రూల్‌ ఆఫ్‌ లా అమలు చేయాల్సిందే’ అని హైకోర్టు ఘాటు కామెంట్స్‌ చేసింది. ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న కార్మికుల సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలని, శాలరీ ఎరియర్స్‌ చెల్లించాలని ఈ ఏడాది ఆగస్టు 7న సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ అప్పీల్‌ పిటిషన్‌ వేసింది. దీన్ని గురువారం చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ విచారించింది.

ఇదేం నిజాంరాజ్యం కాదు

మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ యాక్ట్‌‌–1994 ప్రకారం వారందరి సర్వీసుల్ని రెగ్యులరైజ్‌‌ చేయాల్సిందేనని అభిప్రాయపడింది. ఆర్థిక పరిస్థితుల పేరుతో చట్టాలకు వ్యతిరేకంగా ఏళ్ల తరబడి శ్రమ దోపిడీకి పాల్పడితే ఎలాగని.. ఓసారి సుప్రీం తీర్పులు చూస్తే తెలుస్తుందని కామెంట్‌‌ చేసింది.‘ఔట్‌‌సోర్సింగ్‌‌ స్టాఫ్‌‌తో ఇంతకాలం శ్రమ దోపిడీకి పాల్పడ్డారు. ఇకపై జీహెచ్‌‌ఎంసీ నిజాయితీగా వ్యవహరించాలి. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో చెప్పాలి’ అని కోరింది.  జీహెచ్‌‌ఎంసీలో పర్మనెంట్‌‌ పనులున్నప్పుడు తాత్కాలిక స్టాఫ్‌‌తో ఎందుకు పనులు చేయిస్తున్నారో.. ఎంటమాలజీ ఫీల్డ్‌‌ వర్కర్స్‌‌/సుపీరియర్‌‌ ఫీల్డ్‌‌ వర్కర్స్, ఫీల్డ్‌‌ అసిస్టెంట్స్ పోస్టుల మంజూరు ఎంతో చెప్పాలని అడిగింది. కేడర్‌‌, నాన్‌‌ కేడర్‌‌ పోస్టుల వివరాలూ కౌంటర్‌‌ దాఖలు చేయాలంది. విచారణను 29కి వాయిదా వేసింది.

ఆర్థిక భారం ఎక్కువైతది: జీహెచ్‌ఎంసీ

జీహెచ్‌ఎంసీలో రెగ్యులర్‌ స్టాఫ్‌ 5 వేల మంది, ఔట్‌ సోర్సింగ్‌లో 30 వేల మంది పని చేస్తారని, అందరినీ రెగ్యులరైజ్‌ చేస్తే ఎంతో ఆర్థిక భారం పడుతుందని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ చేసిన వాదనతో హైకోర్టు సంతృప్తి చెందలేదు.