రేవంత్ సర్కార్ను టచ్ చేసే శక్తి ఎవ్వరికీ లేదు: ఖర్గే

రేవంత్ సర్కార్ను టచ్ చేసే శక్తి ఎవ్వరికీ లేదు: ఖర్గే

తెలంగాణలో  రేవంత్ సర్కార్ ఐదేళ్లు ఉంటుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ సర్కార్ ను టచ్ చేసే శక్తి ఎవ్వరికీ లేదని చెప్పారు. దేశంలో తాము ఓట్లకోసం రాజకీయం చెయ్యబోమన్నారు.  అంబానీ,ఆదానీలతో మోదీ దోస్తానా అందరికీ తెలుసు.. వాళ్ల  ఫ్లైట్లలో ఎవరెవరు తిరిగారో ప్రజలకు తెలుసని అన్నారు. పబ్లిక్ సెక్టార్ లోని ఆస్తులను  ఆదానీ, అంబానీలకు  మోదీ కట్టబెట్టారని ఆరోపించారు. దేశంలోని సగం జనాభా ఆస్తులు వాళ్ల దగ్గరే ఉన్నాయని తెలిపారు. అంబానీ,అదానీ రాహుల్ కు డబ్బులు ఇస్తుంటే ఈడీ, సీబీఐ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. టెంపోల్లో డబ్బులు వస్తుంటే మీరేం ఏం చేస్తున్నారు.. దమ్ముంటే  టెంపోలో డబ్బుపై విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు ఖర్గే.

తెలంగాణలో  రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో వేశామన్నారు ఖర్గే.  రాష్ట్రంలో ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు.  మరో గ్యారంటీకి ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉందన్నారు.  త్వరలోనే  మరో గ్యారంటీ అమలు చేస్తామన్నారు.  బీజేపీ హయాంలో రాష్ట్రానికి ఏం వచ్చాయి.. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు పెద్ద ప్రాజెక్టులు వచ్చాయని తెలిపారు.   హైదరాబాద్ కు మోదీ ఒక్క  పెద్ద ఇన్వెస్ట్ మెంట్ ను కూడా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు.

పాకిస్తాన్ కంటే వంద రెట్లు  భారత్ బలమైనదన్నారు మల్లికార్జున ఖర్గే.  నేతల వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీలకు సంబంధం లేదన్నారు. హస్తం శాశ్వతం..కమలం వాడిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు బీజేపీ భయపడుతోందన్నారు. 

ఓటమి భయంతోనే రాజకీయాల్లో మతాన్ని లాగుతున్నారని విమర్శించారు. మంగళసూత్రాలు తీసుకోవడం అనేది  దేశంలో ఎక్కడా జరగదన్నారు. బీజేపీ జనాన్నిభయపెట్టే కుట్ర చేస్తుంది..  ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తుంది. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా చేయడం దారుణమన్నారు. 

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్యారంటీలు అమలు చేస్తామని ఖర్గే చెప్పారు.  మహాలక్ష్మీ స్కీం కింద ప్రతి మహిళకు ఖాతాలో  ఏడాదికి లక్ష వేస్తాం. కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు అమలు చేస్తాం.  కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. ఉపాధి హామీ కూలి రూ.400 లకు పెంచుతాం. ఎవరికి ఏం కావాలో ఇస్తాం.  సివిల్ సర్వీసు ఆఫీసుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలు 27 శాతమే ఉన్నారు.  బడుగు బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.