కళ్ల ముందే పక్క మనిషి చచ్చిపోతున్నా కనీసం పట్టించుకోని రోజులివి. అదే ఇక జంతువుల ప్రాణాలంటే అసలు లెక్క కూడా చేయరు. సాటి మనుషులనే పట్టించుకోని ఈ రోజుల్లో కూడా ఓ డాక్టర్ మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. ఓపెంపుడు కుక్క ప్రాణాలు రక్షించేందుకు ఏకంగా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. ఢిల్లీ నుంచి విమానంలో వచ్చి కుక్క ప్రాణాలు కాపాడారు. మానవత్వానికి అద్దం పట్టే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన ఓ వ్యక్తి గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ కుక్క అంటే ఆ ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. ఇటీవల ఆ పెట్ డాగ్ అస్వస్థతకు గురైంది. తిండి తినట్లేదు.. నీళ్లు తాగట్లేదు. రోజు ఎంతో ఉత్సాహంగా ఉండే ఆ కుక్క ఒక్కసారిగా డీలా పడిపోవడంతో యాజమాని ఆందోళనకు గురయ్యాడు. కుక్క బాధను చూడలేక వెంటనే ఓ పెట్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాగ్ సమస్య నార్మల్ది కాదని సదరు డాక్టర్ గుర్తించారు.
సమస్య తీవ్రంగా ఉందనే అనుమానంతో కుక్కకు ఎక్స్ రే తీయించారు. ఎక్స్ రేలో షాకింగ్ విషయం బయటపడింది. కుక్క కడుపులో దారపు ఉండ, సూది ఉన్నట్లు తేలింది. దీంతో ఎంత ఖర్చు అయినా పర్లేదు కుక్కను బతికించమని సదరు యాజమాని డాక్టర్‌ను వేడుకున్నాడు. డాక్టర్ కూడా సర్జరీ చేసి కుక్క కడుపులోంచి సూది, దారం తీద్దామనుకున్నాడు. కానీ సర్జరీ సమయంలో కుక్కకు ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. దీంతో సర్జరీ సాధ్యం కాదని.. అలాగే ముందుకు వెళ్తే కుక్క ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్పాడు. ఏం చేయాలో అర్ధంకాక.. ఎలాగైనా కుక్కను బతికించాలని డాక్టర్‌ను ప్రాధేయపడ్డాడు.
►ALSO READ | వైజాగ్ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
యాజమాని బాధ చూడలేక ఆ డాక్టర్ వెంటనే ఢిల్లీలో ఉన్న తన స్నేహితుడు, వెటర్నరీ స్పెషలిస్ట్ డాక్టర్ మల్హోత్రాకు ఫోన్ చేసి పరిస్థితి మొత్తం వివరించాడు. ఈ స్టోరీ విని డాక్టర్ మల్హోత్రా మనసు కూడా కరిగింది. ఎలాగైనా ఆ కుక్కను బతికించాలని ఢిల్లీ నుంచి ఏపీకి విమానంలో వచ్చాడు. ఆయనతో పాటు సర్జరీకి సంబంధించిన కొన్ని పరికరాలు కూడా వెంట తెచ్చుకున్నారు. సర్జరీ చేస్తే కుక్క ప్రాణాలకు ప్రమాదంతో ఉండటంతో ఆత్యాధునిక ఎండోస్కోపి విధానంలో ట్రీట్మెంట్ చేసి కుక్క కడుపులోంచి సూది, దారం ఉండను బయటకు తీశారు.
దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి ఆపరేషన్ విజయవంతం చేశారు. కుక్క క్షేమంగా ఉండటంతో సదరు యాజమాని ఆనందం వ్యక్తం చేయడంతో పాటు.. ఢిల్లీ నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేసి కుక్కను బతికించిన డాక్టర్ మల్హోత్రాకు ధన్యవాదాలు తెలిపాడు. ఢిల్లీ నుంచి వచ్చి మరీ డాక్టర్ కుక్కను బతికించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సదరు డాక్టర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
