ఫ్యామిలీలో గొడవలు నేరాలకు కారణాలివే..

ఫ్యామిలీలో గొడవలు నేరాలకు కారణాలివే..

హైదరాబాద్, వెలుగు : ‘పేదరికం, నిరుద్యోగం, కుటుంబాల్లో గొడవలు, మద్యం ప్రభావం కారణంగా నేరాలు పెరుగుతున్నయ్. మర్డర్లు, రేప్‌‌‌‌లు వంటి తీవ్ర నేరాలు చేస్తున్న వారిలో సగం మంది పేదలే ఉంటున్నరు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాల్లో గొడవలతో చివరికి సొంత వారిని కూడా కడతేరుస్తున్నారు’ అని మెంటల్ హెల్త్‌‌‌‌ ఇనిస్టిట్యూట్ చేసిన సర్వేలో తేలింది. ఈ వివరాలను సైకియాట్రి జర్నల్‌‌‌‌లో పబ్లిష్ చేశారు. హత్యలు, అత్యాచారాలు చేసి జైలులో సెంట్రల్‌‌‌‌ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 60 మంది మగ ఖైదీలపై సైకియాట్రిస్టులు సర్వే చేయగా, వీరిలో సగం మంది నిరుపేదలే ఉన్నట్టు తేలింది. 70 శాతం మంది కుటుంబాల్లో గొడవల వల్ల నేరాలు చేసినట్టు వెల్లడించారు. సుమారు 60 శాతం కేసుల్లో నేరస్తుల కుటుంబసభ్యులే బాధితులుగా ఉన్నారు. ఇందులోనూ సగం మంది తమ భార్యలనే కడతేర్చారు. ఈ నేరస్తుల్లో 10 శాతం మంది డిగ్రీలు, పీజీలు పూర్తి చేసినవారు కాగా, 72 శాతం మంది ఇంటర్మీడియట్ అంతకంటే తక్కువ చదివినవారే. మరో 8 శాతం మంది పూర్తిగా నిరాక్షరాస్యులు కాగా, 10 శాతం మంది ఐదో తరగతి లోపు చదివినవాళ్లే ఉన్నారు.

మందు తాగినోళ్లు కూడా…

పెద్ద నేరాలకు మద్యం అలవాటు కూడా ఓ కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఎక్కువమంది లిక్కర్​కు అలవాటు పడుతున్నారు. 60 మంది ఖైదీల్లో 35 మంది మందుకు బానిసలు కాగా, మద్యం మత్తులోనే నేరానికి పాల్పడినట్టు 28 మంది వెల్లడించారు. కేవలం 10 మంది మాత్రమే తాము ప్రీప్లాన్డ్​ క్రైమ్స్​చేసినట్టు చెప్పారు. మిగిలిన వాళ్లంతా యాక్సిడెంటల్‌‌‌‌గా, అవతలివాళ్లు రెచ్చగొట్టడం వల్ల క్షణికావేశంలో చేశామని తెలిపారు. 60 మంది నేరస్తుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే ప్రీవియస్ క్రైమ్ రికార్డు ఉండగా, మిగిలినవాళ్లంతా తొలిసారి నేరం చేసి జైలుకు వచ్చినవారే. గతంలో బాల నేరస్తులపై చేసిన సర్వేలోనూ అల్కాహాల్​, గంజాయి వంటి అలవాట్లు ఉన్న పిల్లలే నేరాలకు పాల్పడుతున్నట్టు తేలింది. ఒకటి కంటే ఎక్కువసార్లు నేరం చేసి జువైనల్‌‌‌‌ హోమ్‌‌‌‌కు వచ్చినవాళ్లలో 90శాతం మందికి అల్కాహాల్, గంజాయి అలవాటు ఉన్నట్టు సర్వే వెల్లడించింది.

అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ కార్యక్రమాలు

నేరానికి పాల్పడినప్పుడు ఖైదీల మానసిక స్థితి ఎట్లుందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ స్టడీ చేసినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఆల్కాహాల్ ఇతర మత్తు పదార్థాల అలవాటు తప్ప, మానసికంగా వాళ్లంతా బాగానే ఉన్నారని తేలింది. నేరం చేసిన సమయంలో అందరి మానసిక స్థితి బాగానే ఉన్నప్పటికీ, జైలు జీవితంతో 10 శాతం మందికి ‘అడ్జస్ట్‌‌‌‌మెంట్ డిసార్డర్‌‌‌‌’ వచ్చినట్టు సైకియాట్రిస్టులు తేల్చారు. ఈ మానసిక వ్యాధి వల్ల కొత్త ప్లేస్​లో ఉండలేకపోతారు. నేరాలకు ఉసిగొల్పుతున్న అల్కాహాల్ ప్రభావంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్టడీ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్నారు. దీంతో కొంతైన అల్కాహాల్​ వినియోగం తగ్గి, తద్వారా క్రైమ్ రేట్‌‌‌‌ కూడా తగ్గుతుందన్నారు.