ఆ ఇళ్ళకి కుక్కలే తాళం

ఆ ఇళ్ళకి కుక్కలే తాళం

ఆ ఊళ్లలో చాలామంది ఇళ్లకు తాళాలు వేయకుండానే పనులకు వెళ్తుంటారు.  ఇళ్లలో విలువైన వస్తువులు ఉండవా? అంటే.. ఉంటాయి. అయినా దొంగలు అటువైపుగా చూడరు. మరెందుకు అలా వదిలి వెళ్తారు? ఎందుకంటే ప్రతి ఇంట్లో కుక్కలుంటాయి. యజమాని తిరిగొచ్చేవరకు ఇంటిని కంటికిరెప్పలా కాపాడతాయి. ఆ కుక్కలే వాళ్లకు కొండంత ధీమా. అంతేకాదు పంటలకు కూడా అవే కాపలా. 

అక్కడ ఏ ఇంటికెళ్లినా.. మనుషులున్నా లేకపోయినా కుక్కలు మాత్రం ఉంటాయి! కొత్త వాళ్లు ఎవరొచ్చినా అరుపులతో స్వాగతం పలుకుతాయి. ఇంటికో కుక్క ఉందంటే.. అది బాగా డబ్బున్నవాళ్లు ఉండే కాలనీ అనుకుంటే పొరపాటే. అవి ఆసిఫాబాద్‌‌ జిల్లాల్లోని మారుమూల గిరిజన పల్లెలు. ఇక్కడి ఇంటికో కుక్క కథేంటి? 

జైనూర్​, వెలుగు : ఆ ఊళ్లలో కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాళ్లు తినేదే కుక్కలకూ పెడతారు. అవి కూడా ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఆసిఫాబాద్​ జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన జైనూర్​, సిర్​పూర్​ యు, లింగాపూర్​లో ఆదివాసులు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఊళ్లన్నీ అటవీ ప్రాంతంలో ఉంటాయి. అందుకే వాళ్ల రక్షణ కోసం ప్రతి ఇంటికీ కుక్కను పెంచుతుంటారు. వాటిని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇల్లు, పొలం దగ్గర కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు వెంటనే అరిచి అలర్ట్‌‌ చేస్తాయి. యజమాని సైగ చెయ్యనిదే ఎంతటివాళ్లయినా సరే  గడప దాటి రానివ్వవు. కానీ.. యజమాని బంధువులు, స్నేహితులను మాత్రం గుర్తుపట్టి లోనికి పోనిస్తాయి. ఒకవేళ పక్కింటివాళ్లు యజమానిని పిలిచినప్పుడు కుక్క అరిచిందంటే.. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించాలి. అలా అరిచినా.. వెనకడుగు వేయకుండా ఇంట్లోకి వెళ్తే.. పిక్క కుక్కనోటికి చిక్కినట్టే. అందుకే ఆ ఊళ్లో కొత్తవాళ్లు ఎవరైనా తిరగాలంటే..  ఆ ఊరి వాళ్లను వెంట తీసుకెళ్లక తప్పదు.

కొండంత ధీమా

ఆ ఊళ్లలో చాలామంది ఇంటిదగ్గర కుక్కలు ఉంటే.. ధీమాగా ఉంటారు. ఒక్కోసారి తాళాలు వేయకుండానే పొలానికి వెళ్లిపోతారు. యజమానులు వచ్చేవరకు కుక్కలు గుమ్మాల ముందే కూర్చుని ఉంటాయి. చేలో కూడా పందిరి కిందే ఉండి నాలుగు దిక్కులా చూస్తూ కాపలా కాస్తాయి. అప్పుడప్పుడు చేను చుట్టూ తిరుగుతూ అడవిపందులు, కోతులు వస్తే యజమానికి వినపడేలా గట్టిగా అరుస్తాయి. రాత్రి యజమాని పందిరిపైన ఉండి కాపలా కాస్తే కుక్క పందిరి కింద ఉండి కాపలా కాస్తుంది.

ట్రైనింగ్‌‌

ఇవి వీధి కుక్కలే అయినా.. వాటికి చిన్నప్పటినుంచే ట్రైనింగ్ ఇస్తారు. యజమాని ఇచ్చే సైగల​తో కుక్కలు నడుచుకుంటాయి. యజమాని బయటకు వెళ్లేటప్పుడు వెంట రమ్మంటే వెళ్తాయి. లేదంటే..  వెళ్లిన యజమాని తిరిగి వచ్చేవరకు గుమ్మం ముందే కాపలా కాస్తాయి. ఇక్కడి వాళ్లు కుక్కలను పిలవడానికి ఎక్కువగా విజిల్‌‌ వేస్తుంటారు. యజమాని విజిల్‌‌ వేయగానే దగ్గరకు వస్తాయి. ఈ విజిల్స్‌‌లో కూడా పన్నెండు రకాలు ఉన్నాయి. లాంగ్​ విజల్ వేస్తే ‘అడవికి వెళ్లాలి’, మూడు సార్లు వేస్తే  ​‘చేలోకి వెళ్లాలి’, చిటికేస్తే సైలెంట్​గా ఉండమని అని అర్థమట!

అడవి పందులంటే పిచ్చకోపం

పంటలను అడవిపందుల నుంచి కాపాడు తాయి. పందులను తరిమి కొట్టడానికి రైతులకి ఎంతో సాయపడతాయి. చేలో కుక్క ఉందంటే పందులు అటువైపు రావడానికే జంకుతాయి. కుక్కలకు పందులంటే పిచ్చకోపం. అవి కనిపిస్తే విరుచుకుపడతాయి.

ఇంటి మనిషిగానే..

ఆదివాసులు కుక్కలను ఇంటి మనిషిగానే ట్రీట్‌‌చేస్తుంటారు. ఊళ్లో సహపంక్తి భోజనాలప్పుడు ప్రతి ఇంటి నుంచి కొన్ని బియ్యం, సరుకులు ఇస్తుంటారు. అప్పుడు ఇంట్లో కుక్కల కోసం కూడా కొంత బియ్యం ఇస్తుంటారు. భోజనాల తర్వాత కుక్కలకు కూడా అన్నం పెడతారు.