రాజన్న సిరిసిల్ల/వేములవాడ, వెలుగు: తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదని.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన శుక్రవారం వేములవాడ, సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు వార్డుల్లో కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, రెండేండ్లయినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు.
‘‘మంత్రి పదవి కోసం వేములవాడ ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్ పాకులాడుతున్నారు. మంత్రి పదవి కోసం సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కుతున్నారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని ఆది శ్రీనివాస్ బాండ్ పేపర్ రాసిచ్చారు.
కానీ ఒక్క హామీ కూడా నేరవేర్చలేదు. నాలుగు సార్లు ఓడిపోయానని ఏడ్చి ఎన్నికల్లో గెలిచారు. ఈసారి సెంటిమెంట్ మాటలను నమ్మి, ప్రజలు మరోసారి మోసపోవద్దు” అని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్కరీంనగర్ ప్రజలకు చేసిందేమీ లేదని, ఎన్నికలు రాగానే దేవుని పేరు చెప్పి ఓట్లు దండుకునుడు మాత్రమే బీజేపీకి తెలుసని విమర్శించారు. తాను మంత్రిగా ఉన్న పదేండ్లలో సిరిసిల్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని.. మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేయించానని తెలిపారు.
పరిహారం కోసం నిలదీసిన మహిళలు..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. సిరిసిల్లలోని 9వ వార్డు బాబాజీ కాలనీలో ప్రచారానికి వెళ్లిన కేటీఆర్‌ను పరిహారం కోసం స్థానిక మహిళలు నిలదీశారు. ‘‘మీరు మంత్రిగా ఉన్నప్పుడే మెడికల్ కాలేజీకి భూములిచ్చాం. కానీ పరిహారం ఇంకా రాలేదు. గతంలో ఈ వార్డు నుంచి గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ అభివృద్ధి చేయలేదు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి” అని మండిపడ్డారు. కలెక్టరేట్ వద్ద భూనిర్వాసితులతో కలిసి ధర్నా చేసైనా పరిహారం ఇప్పిస్తానని కేటీఆర్హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలను కూడా తీరుస్తానని చెప్పడంతో కాలనీ వాసులు శాంతించారు.
