డోర్నకల్ చర్చికి 80 ఏళ్లు

డోర్నకల్ చర్చికి 80 ఏళ్లు

మెదక్ చర్చి తర్వాత దేశంలో అంతటి ప్రత్యేకత డోర్నకల్​ సిఎస్ఐకి ఉంది. ఇది మహబూబాబాద్‌‌ జిల్లాలో ఉంది. దీని నిర్మాణం 1939లో పూర్తైంది. 1910లో ఈడెన్​బర్గ్‌‌లో జరిగిన ఒక సమావేశంలో ‘ఒలంపియా డయాసిషన్’ ఏర్పాటు అయ్యింది. అదే సంవత్సరం భారతదేశంలో నిజాం రాజ్యంలో డయాసిషన్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే నిజాం రాజ్యంలో చర్చిని కట్టించారు. అదే డోర్నకల్‌‌ సిఎస్‌‌ఐ. దీన్ని ఇక్కడ కట్టించడానికి బిషప్‌‌ దేవనాయగం సామ్యూల్‌‌ అజరయ్య ఎంతో కృషి చేశారు. 1915, జనవరి14న ఎఫిఫని కేథడ్రల్ పేరిట ఈ చర్చి నిర్మాణం మొదలైంది. అప్పటి మద్రాసు 5వ బిషప్​ హెన్రీవైట్ దీనికి శంఖుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తి కావడానికి 24 సంవత్సరాలు పట్టింది. 1939 జనవరి 6న ఈ చర్చిలో క్రీస్తును స్తుతిస్తూ తొలి ప్రార్థన చేశారు.

ఎన్నో ప్రత్యేకతలు

హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల కలయికతో ఈ చర్చిని కట్టడం విశేషం. లోపలికి వెళ్లగానే తెల్లని చలువరాతి బండలు పాదాలను తాకుతాయి. శిలలా కనిపించే రెండు మండప తోరణాలపై ఎఫిఫనీ నక్షత్రం, పద్మాలు వాటిపై రెండు కలువలు ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో స్వాగతం పలుకుతున్నట్లుగా చర్చి ద్వారం ఉంటుంది. చర్చి ముఖద్వారంలో ఉన్న రెండు పెద్ద తలుపులపై మేలిమి ఇత్తడితో చేసిన గోపురాకృతులు, పిడులు అమర్చడంతో అచ్చు హిందూ దేవాలయ ప్రధాన ముఖద్వారంలా కనిపిస్తుంది. చర్చిపై రెండు వైపులా ఉన్న మినార్లు మసీద్​ గోపురాల్లా ఉంటాయి. విశాలమైన భవనంలో తెల్లటి రాతి స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాల్లో చెక్కిన అరటి మొగ్గ సన్మార్గానికి, ఉమ్మెత్త పువ్వు పాప వినాశనానికి సూచిక అని చరిత్రకారులు చెప్తున్నారు.

చర్చి

1906 అక్టోబర్ 6న మద్రాసు బిషప్ హెన్రీవైట్ డోర్నకల్‌‌ వచ్చి 15మంది మగవాళ్లు, 18 మంది ఆడవాళ్లకు బాప్టిజం ఇచ్చాడు. 1909లో వేదనాయకం సామ్యూల్‌‌ అజరయ్య ప్రథమ మిషనరీగా వచ్చాడు. డయాసిషన్ ఏర్పాటు తర్వాత 1912లో డోర్నకల్ మొదటి బిషప్‌‌గా బాధ్యతలు తీసుకున్నాడు. కర్నూలు, పశ్చిమ గోదావరి, దుమ్ముగూడెం, కృష్ణ, నల్గొండ తదితర ప్రాంతాల్లోని క్రైస్తవ మిషనరీలను కలుపుతూ 1920లో ఎఫిఫని కోపల్ సినాడ్ ఏర్పాటు అయ్యింది. అప్పుడు ఈ సినాడ్‌‌లో 8వేల మంది ఉద్యోగులు, సంఘస్తులు ఉండేవాళ్లు. డోర్నకల్‌‌ చర్చి ఈ సినాడ్‌‌లో భాగంగా ఉండేది. ప్రస్తుతం ఈ చర్చికి రైట్ రెవరెండ్​ డాక్టర్ వాడపల్లి ప్రసాద్​ రావు 8వ పీఠాధిపతిగా ఉన్నారు. ఇక్కడ ప్రతి రోజూ ప్రార్థనలు, గీతాలాపనలు చేస్తుంటారు. 600పైగా చర్చిలు కలిగిన ఈ అధ్యక్ష మండలంలో బధిర పాఠశాలలు, కళాశాలలతో పాటు ఎప్పుడూ సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాడపల్లి ప్రసాద్​ రావు అధ్యక్షతన క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు దేశ విదేశాల్లోని క్రైస్తవులతో పాటు వివిధవర్గాల ప్రజలు వచ్చి ఏసు సందేశం వింటారు.