కార్ల కోసం రెండేళ్లుగా మైనార్టీల ఎదురుచూపులు

కార్ల కోసం రెండేళ్లుగా మైనార్టీల ఎదురుచూపులు

ఖమ్మం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీల అభివృద్ధి కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదని ముస్లిం యువకులు మండిపడుతున్నారు. రెండేళ్ల నుంచి డ్రైవర్​ ఎంపవర్​మెంట్ స్కీమ్​ లబ్ధిదారులకు కార్లు ఇవ్వడం లేదని ఫైర్​ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్​ ఎంపవర్​మెంట్ స్కీమ్​ కోసం మైనార్టీ ఫైనాన్స్​ కార్పొరేషన్​ ద్వారా 2019–-20లో అప్లికేషన్లు తీసుకున్నారు. అన్ని జిల్లాల నుంచి 20 వేల మంది వరకు ఆన్​లైన్​ ద్వారా అప్లై చేసుకున్నారు. ఇందులో 14 వేల మందికి పైగా ఇంటర్వ్యూలు నిర్వహించి, 7 వేల మందిని అర్హులుగా ప్రకటించారు. కానీ ఏడాది దాటుతున్నా ఇంతవరకు అర్హులను ఫైనల్​ చేయలేదు. దీంతో అప్లికేషన్లు పెట్టుకున్న లబ్ధిదారులు ఆఫీసర్ల నుంచి  సమాచారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 

ఖమ్మం జిల్లాలో ఆరుగురికేనట..

ఖమ్మం జిల్లాకు సంబంధించి 2019-–20లో ఆన్ లైన్​ద్వారా 375 మంది కార్ల కోసం అప్లై చేసుకున్నారు. వారిలో జిల్లా స్థాయిలో ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ​కోసం 196 మంది అటెండయ్యారు. ఈ లిస్ట్ నుంచి అర్హులను ఎంపిక చేయడం కోసం స్టేట్ లెవల్ కమిటీకి ఆఫీసర్లు పంపించారు. కానీ ఈ జిల్లాకు కేవలం రూ. 27 లక్షలు కేటాయించడంతో ఆరుగురికి మాత్రమే కార్లు ఇవ్వనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 134 మంది అప్లై చేసుకుంటే 67 మందిని ఎంపిక చేశారు. ఫైనల్​గా నలుగురికి మాత్రమే కార్లు ఇవ్వనున్నారు. దీంతో నిరుద్యోగ మైనారిటీ యువకులు నిరాశ చెందుతున్నారు. రెండేళ్లు దాటుతున్నా కార్లు ఇవ్వకపోవడం, తుది లబ్ధిదారులను ప్రకటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సర్కారు మోసం చేస్తోంది

నిరుద్యోగ ముస్లిం యువకులను టీఆర్ఎస్​సర్కార్​మోసం చేస్తోంది. డ్రైవర్​ఎంపవర్​మెంట్ స్కీమ్​కోసం యూత్ నుంచి ఆన్​లైన్​అప్లికేషన్లు తీసుకొని రెండేళ్లవుతున్నా కార్లు ఇవ్వడం లేదు. అప్లై చేసుకున్న వారిలో అర్హులుగా ప్రకటించిన 7 వేల మంది ఇప్పటికీ కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి నెలలవుతోంది. కార్లు ఇంకెప్పుడిస్తరు. 
- యాకూబ్​పాషా, మైనార్టీ వెల్ఫేర్​ అసోసియేషన్​ అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నం

2019లో ఆన్​లైన్ ​ద్వారా అప్లై చేసుకున్నా. గతేడాది కొవిడ్ ​కంటే ముందే ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్​కూడా చేశారు. అప్పటి నుంచి ఫైనల్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నా. డ్రైవర్​ను ఓనర్​గా చేసే ఇలాంటి మంచి స్కీమ్ లను ప్రతి యేటా అమలు చేస్తే బాగుంటుంది. జిల్లా మైనార్టీ వెల్ఫేర్​ ఆఫీస్​లో ఎన్నిసార్లు అడిగినా కొవిడ్ కారణంగా ఆలస్యమవుతోందని చెబుతున్నారు.
- సల్మాన్ ​షేక్, ఖమ్మం 

జాబితాను ఉన్నతాధికారులకు పంపించాం

జిల్లా స్థాయిలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ​తర్వాత సెలక్ట్​ అయిన అభ్యర్థుల లిస్టును ఉన్నతాధికారులకు పంపించాం. రాష్ట్ర స్థాయి కమిటీ తుది లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. కొవిడ్ కారణంగా లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమైన మాట వాస్తవమే. త్వరలోనే లిస్ట్ ఫైనల్ చేసి వెహికల్స్​ను అందించే అవకాశముంది. 
- గుడికందుల జ్యోతి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్​, ఖమ్మం