జిల్లాలకూ పాకుతున్న డ్రగ్స్

జిల్లాలకూ పాకుతున్న డ్రగ్స్
  • వరంగల్, కరీంనగర్, మహబూబ్‍నగర్‍ జిల్లాల్లో కేసులు
  • గుడ్‍ స్టఫ్‍ పేరుతో కొకైన్, చరస్, హుక్కాపాట్‍ అమ్మకాలు
  • సిటీల్లోని డబ్బున్న యూత్‍ టార్గెట్‍గా డ్రగ్స్ డీలర్ల దందా
  • కస్టమర్‍ కమ్‍ బిజినెస్‍ పార్ట్‌‌నర్‍ ఆఫర్లు ఇస్తున్న ముఠాలు
  • జిల్లా కేంద్రాల్లో సరికొత్త బిజినెస్.. పోలీసులకు నయా సవాల్

వరంగల్, వెలుగు: ఇన్నాళ్లూ హైదరాబాద్‌‌కే పరిమితమైన డ్రగ్స్ కల్చర్.. ఇప్పుడు రాష్ట్రమంతటా విస్తరిస్తోంది. కొకైన్, చరస్, హుక్కాపాట్ వంటివి జిల్లాలకూ చేరుతున్నాయి. వరంగల్, కరీంనగర్, మహబూబ్‍నగర్‍ జిల్లాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. గంజాయిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. డ్రగ్స్‌‌ కట్టడిని పట్టించుకోలేదు. దీంతో డబ్బున్న యూత్‍ టార్గెట్‍గా డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. కస్టమర్‍ కమ్‍ బిజినెస్‍ పార్ట్‌‌నర్‍ ఆఫర్లు ఇస్తున్నాయి. జిల్లాల్లో గుడుంబా, గంజాయి కేసులంటేనే వామ్మో అన్నట్లు చూసే లోకల్‍ పోలీసోళ్లకు.. సరికొత్త బిజినెస్ స్టార్ట్‌‌ చేసిన డ్రగ్స్ డీలర్లు సవాల్ విసురుతున్నారు.

యువతే టార్గెట్

డ్రగ్స్ ముఠాలు సిటీలు, టౌన్లలో డబ్బులుండే యూత్‍ను టార్గెట్‍ చేస్తూ దందా చేస్తున్నాయి. కాలేజీలు, ఇన్‌‌స్టిట్యూట్స్‌‌లోని స్టూడెంట్లకు డ్రగ్స్‌‌ అలవాటు చేసేందుకు కొన్ని టీమ్స్ పని చేస్తున్నాయి. ఏదో ఒక పార్టీ పేరు చెప్పి హోటల్స్, రూముల్లో వారికి కొకైన్ లాంటివి ఇచ్చి మెల్లగా వాటికి బానిసలను చేస్తున్నాయి. వారిని రెగ్యులర్‍ కస్టమర్స్​గా మార్చుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి కొత్త స్టాక్‍ వస్తే.. ‘గుడ్‍ స్టఫ్‍, గుడ్‍ మాల్’ వచ్చిందంటూ మెసేజ్‌‌లు చేస్తున్నాయి. ‘కస్టమర్ కమ్ బిజినెస్ పార్ట్‌‌నర్’ పేరుతో కొందరిని వ్యాపారంలోకి కూడా దించుతున్నాయి. తమకు కావాల్సిన స్టాక్‍ ఫ్రీగా దొరకడం, అమ్మితే డబ్బులు వస్తుండడంతో యువత ఉచ్చులోకి దిగుతున్నారు. ఒక స్టూడెంట్ ఇలా మారితే.. ఆరు నెలల గడిచే సరికి డ్రగ్స్ అలవాటు వందల మందికి పాకుతోంది.

వరంగల్‌‌లో 3 నెలలుగా దందా

శుక్రవారం హనుమకొండ జిల్లాలో డ్రగ్స్‌‌ దందా గుట్టు బయటపడింది. పిన్నవారివీధికి చెందిన శివ్వా రోహన్.. హైదరాబాద్‍కు చెందిన తన ఫ్రెండ్‍ కాశీరావుతో కలిసి వరంగల్‍ యూత్‍ను అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టాడు. గోవాలో ఉండే ఫారినర్లు కాల్జోఫర్, జాక్‍ ద్వారా కొకైన్, చరాస్, గంజాయితో తయారు చేసిన మత్తు పదార్థాలను తెచ్చి అమ్ముతున్నాడు. వీరిద్దరూ మూడు నెలలుగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు లాడ్జీలను మారుస్తూ దందా నడిపించారు. మొత్తంగా ఈ కేసులో ఆరుగురు యువకులను అరెస్ట్ చేసి రూ.3.16 లక్షల విలువైన డ్రగ్స్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల హైదరాబాద్‌‌లోని కూకట్‍పల్లిలో రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రిన్ డ్రగ్‍ కలకలం రేపింది. ఈ ఘటనకు రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాలకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. కరీంనగర్‍ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లికి చెందిన చిటుకురి ప్రశాంత్​రెడ్డి, మహబూబ్‍ నగర్‍ జిల్లా తిమ్మాయిపేటకు చెందిన కన్నారెడ్డి, నాగర్‍ కర్నూల్‍ జిల్లా తిమ్మాజిపేట మండలం బవాజీపల్లికి చెందిన కొండునూరి రామకృష్ణగౌడ్‍.. ఈ డ్రగ్‍ దందాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరికి వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన ముఠా సభ్యులతో పరిచయాలు ఉన్నట్లు కనుగొన్నారు. 

డ్రగ్స్ తయారీలో సైంటిస్టులు

ఫార్మా రీసెర్చ్ రంగంలో పీహెచ్‍డీలు చేసిన వాళ్లు పక్కదారి పడుతున్నారు. 2016లో హైదరాబాద్‍లోని మియాపూర్‍లో 231 కిలోల యాంపిటోమైన్ పట్టుబడింది. దీని విలువ రూ.45 కోట్లు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‍తో పాటు చెన్నై, బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వెంకటరామారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన బెంగళూరు కెమికల్ ఇండస్ట్రీలో రీసెర్చ్ సైంటిస్ట్. 2020 జీడిమెట్లలో 31 కిలోల మెఫిడ్రిన్‍ ను ఆఫీసర్లు పట్టుకున్నారు. దీని విలువ రూ.63 లక్షల పైమాటే. ఈ కేసులో కెమిస్ట్రీలో పీహెచ్‍డీ చేసిన శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. లేటెస్ట్​గా కూకట్‍పల్లిలోని బాలాజీనగర్​లో రూ.2 కోట్ల విలువ చేసే 4.926 కిలోల మెఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. దీనిని సైతం జీడిమెట్లలోని ఓ ఇండస్ట్రీలో తయారు చేసినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులోనూ ఫార్మా స్టూడెంట్లే ఉన్నట్లు సమాచారం.

పోలీసులకు  కొత్త చాలెంజ్

యూత్‍ డ్రగ్స్​కు అలవాటు పడితే నేరాలు పెరిగే అవకాశముంది. ఇదే ఇప్పుడు జిల్లా కేంద్రాల్లోని సివిల్, టాస్క్‌‌ఫోర్స్ పోలీసులకు చాలెంజ్ అవుతోంది. వరంగల్‍లో ఆరుగురు సభ్యుల ముఠా 3 నెలలుగా కొకైన్, చరాస్‍ అమ్ముతున్నట్లు చెబుతున్నా.. ఏడాదిన్నర నుంచే దాని ఆనవాళ్లు వరంగల్‌‌లో కనిపించాయి. పలు కేసుల్లో పట్టుబడిన పలువురు యువత డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఇప్పటికే వరంగల్, హనుమకొండ, కరీంనగర్, మహబూబ్‍నగర్, నాగర్‍ కర్నూల్‍ వంటి ఏడెనిమిది జిల్లాల్లో డ్రగ్స్ బిజినెస్ ఆనవాళ్లు కనిపించాయని, చుట్టపక్కల జిల్లాలు, పట్టణాల్లో ఇది విస్తరించే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

గ్రాము రూ.7 వేల నుంచి 8,500

స్మగ్లర్లు గోవా, ముంబై నుంచి హెరాయిన్, కొకైన్, చరాస్ వంటివి సిటీకి ట్రాన్స్​పోర్ట్ చేస్తున్నారు. బ్రాండ్‍ను బట్టి రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. లోకల్‍ దందా నిర్వహిస్తున్న వారు ఒక్కో గ్రాము రూ.4 వేలకు కొనుగోలు చేస్తున్నారు. దాన్ని హైదరాబాద్ ఏరియాల్లో అయితే రూ.6 వేల నుంచి 7 వేల వరకు, జిల్లా కేంద్రాల్లో అయితే రూ.8,500 చొప్పున విక్రయిస్తున్నారు. ఇన్‍స్టా, వాట్సాప్‍ గూపుల్లో కోడింగ్‍ భాషలో ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఇలాంటి ముఠాలపై హైదరాబాద్‍ నార్కోటిక్, టాస్క్​ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. నైజీరియన్లతోపాటు డ్రగ్స్ పెడ్లర్ల కాల్ డేటా ఆధారంగా డ్రగ్స్ కు బానిసలైన వారిపై ఫోకస్ పెడుతున్నారు. క్యారియర్ల కదలికలను కనిపెడుతున్నారు.

డ్రగ్స్‌‌పై ఫోకస్​ పెట్టట్లే..

కిందటేడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 84 డ్రగ్స్ కేసులు నమోదు చేసి 213 మందిని అరెస్ట్ చేశారు. 1,158 గ్రాముల డ్రగ్స్, 851 కిలోల గాంజా సీజ్‍ చేశారు. గత నెలలో ఎక్సైజ్ ఆఫీసర్లతో రివ్యూ చేసిన సీఎం కేసీఆర్‍.. గంజాయిని నిర్మూలించాలని ఆర్డర్‍ వేశారు. డీజీ స్థాయి అధికారితో ఓ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. యువత పెడతోవ పట్టడానికి కారణమవుతున్న డ్రగ్స్ ఇష్యూపై మాట్లాడలేదు. మత్తు పదార్థాల వినియోగం రాష్ట్రమంతటా విస్తరిస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు ఈ ఏడాది కొత్తగా లిక్కర్‍ షాపుల సంఖ్య పెంచనున్నారు. బెల్ట్ షాపులైతే.. కిరాణ దుకాణాల్లా ఊరికో పది ఉన్నాయి.