నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి వస్తరు! : జగ్గారెడ్డి

నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి వస్తరు! : జగ్గారెడ్డి
  •     బీఆర్ఎస్ నుంచి 20 మంది చేరుతరు: జగ్గారెడ్డి
  •     కాంగ్రెస్​లో బీఆర్ఎస్ విలీనం రాంగ్ స్టేట్​మెంట్
  •     ఎంపీ లక్ష్మణ్ పొలిటికల్ చిప్ ఖరాబైందని ఎద్దేవా

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్​లో బీఆర్ఎస్ విలీనం అనేది రాంగ్ స్టేట్మెంట్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరొచ్చని, దీంతో తమ బలం 84కు పెరుగుతుందని చెప్పారు. బీజేపీ నుంచి కూడా నలుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్​లో బీఆర్ఎస్ విలీనం అవుతదంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అంటున్నరు. ఆయన పొలిటికల్ చిప్ ఖరాబైంది. బాగు చేసుకోవాలి..

దానికయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తది. అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లరు. ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి వస్తరు’’అని జగ్గారెడ్డి అన్నారు. ఆగస్టులో కాంగ్రెస్ సంక్షోభంలో పడుతుందంటూ లక్ష్మణ్ చేసిన కామెంట్లను ఖండిస్తున్నామని తెలిపారు. పబ్లిక్ కన్ఫ్యూజ్ కావొద్దని, ఆగస్టులో సంక్షోభం అనేది ఒట్టిమాటే అని అన్నారు.

‘‘కాంగ్రెస్​కు 64 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మా పాలన పట్ల ప్రజలు కూడా హ్యాపీగానే ఉన్నరు. బస్సుల్లో మహిళలు ఫ్రీ జర్నీ చేస్తున్నరు. ఐదొందల రూపాయలకే గ్యాస్ అందుకుంటున్నరు. ఆగస్టు 15లోపు రుణ మాఫీ చేస్తాం’’అని తెలిపారు.  

హామీలపై చర్చకు సిద్ధమా?

మోదీ ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని ఎంపీ లక్ష్మణ్​ను జగ్గారెడ్డి ప్రశ్నించారు. ముందు వాటి గురిం చి మాట్లాడాలన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలపై.. కాం గ్రెస్ ఇచ్చిన గ్యారంటీలపై చర్చకు రెడీ అని సవాల్ విసిరారు.  చెప్పింది చేయడం గాంధీ కుటుంబానికి అలవాటని గుర్తు చేశారు. ‘‘బీజేపీ నేతలంతా మోసగాళ్లకు.. మోసగాళ్లు. దేవున్ని కూడా ఎన్నికలకు ఉపయోగించుకుంటున్నరు. ఎంపీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

ఈ క్రెడిట్ అంతా ప్రభుత్వం, సీఎం రేవంత్​దే. గతంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్​ పార్టీ పోలీసులను యూజ్ చేసుకున్నది. మా ప్రభుత్వం ఈసీకి సహకరించింది’’అని అన్నారు. బీజేపీ ఎంత డిస్ట్రబ్ చేసినా తమ ప్రభుత్వం ఐదేండ్లు ఉంటుందని తెలిపారు. రేవంత్, భట్టి, ఉత్తమ్ కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తారని చెప్పారు.