మరో 125 ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్

మరో 125 ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్
  •     త్వరలోనే అన్ని కాలేజీలకు ఇస్తాం: ఇంటర్ బోర్డు వెల్లడి
  •     ‘వెలుగు’ కథనంపై స్పందన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 125 ప్రైవేటు జూనియర్  కాలేజీలకు ఇంటర్  బోర్డు అఫిలియేషన్  ఇచ్చింది. దీంతో బుధవారం నాటికి మొత్తం 1,443 ప్రైవేటు కాలేజీలకు గాను 150 కాలేజీలకు గుర్తింపు ఇచ్చామని బోర్డు ప్రకటించింది. ‘పేరెంట్స్, స్టూడెంట్స్ కు ఇంటర్ బోర్డు పరీక్ష’ హెడ్డింగ్​తో వెలుగు దినపత్రికలో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై ఇంటర్  బోర్డు సెక్రటరీ శ్రుతి ఓజా స్పందించారు. మంగళవారం సాయంత్రం నాటికి 150 కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చేశారు. 

ఉదయమే బోర్డు సెక్రటరీ లాగిన్​లో ఉన్న కాలేజీలన్నింటికీ అఫిలియేషన్  ఇచ్చారు. కాగా, అఫిలియేషన్లపై ఇంటర్  బోర్డు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,269 కాలేజీలు ఉండగా.. వాటిలో 1,759 కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చామని బోర్డు పేర్కొంది. దీంట్లో సర్కారు జూనియర్  కాలేజీలు 421కి 395, ప్రైవేటు కాలేజీలు 1443కు 150, బీసీ వెల్ఫేర్ 261 గురుకుల కాలేజీలకు 244, ఎస్సీ వెల్ఫేర్  235 గురుకుల కాలేజీలకు 214,  ట్రైబల్  వెల్ఫేర్ 127 కాలేజీలకు 115, మైనారిటీ గురుకులాలు 203కు 179, టీఎస్​ఆర్జేసీ 35 కాలేజీలకు 30, 282 కేజీబీవీలకు 270, మోడల్ స్కూళ్లు 194కు 159 కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చామని బోర్డు వివరించింది. ఇంకా 37 ఎయిడెడ్ కాలేజీలు, 18 కోఆపరేటివ్ కాలేజీలు, 9 ఇన్సెంటివ్  కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదని చెప్పింది. అడ్మిషన్ల అప్లికేషన్ల ప్రక్రియ ఈనెల 31 వరకు ఉందని, త్వరలోనే నిబంధనల ప్రకారం ఉన్న కాలేజీలన్నింటికీ అఫిలియేషన్  ఇస్తామని పేర్కొంది.