అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు

అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు
  •     ‘వెలుగు’ కథనంపై స్పందించిన హైదరాబాద్ డీఎంహెచ్‌‌వో

హైదరాబాద్, వెలుగు : అర్హతలేని డాక్టర్లతో పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్‌‌ డీఎంహెచ్‌‌వో‌‌ వెంకటి తెలిపారు. ఈ నెలలోనే పలు హాస్పిటళ్లపై చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఈనెల 13న ‘‘అర్హత లేనోళ్లతో ఐసీయూ డ్యూటీ’’ శీర్షికతో వెలుగు పత్రికలో వచ్చిన వార్తా కథనంపై ఆయన స్పందించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో డ్యూటీ మెడికల్ ఆఫీసర్లుగా ఫార్మ్‌‌ డీ, బీఏఎంఎస్‌‌, బీహెచ్‌‌ఎంఎస్‌‌, బీయూఎంఎస్‌‌ గ్రాడ్యుయేట్లను, స్టూడెంట్లను నియమించుకుంటున్నారని..

వారితో పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్నారని.. ఐసీయూలో డ్యూటీ చేయిస్తున్నారని వార్తాలో పేర్కొన్న అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడే హాస్పిటళ్లపై తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని, వారితో తమకు ఎలాంటి లాలూచీ లేదని ఆయన పేర్కొన్నారు. నాన్  ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించుకున్న పలు హాస్పిటళ్లకు నోటీసులు జారీ చేశామని

అన్ని హాస్పిటల్స్ నుంచి డిక్లరేషన్ కూడా తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఏదైనా హాస్పిటల్‌‌లో నాన్ ఎంబీబీఎస్ డాక్టర్లతో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్నట్టు తెలిస్తే, డీఎంహెచ్‌‌వో ఆఫీసుకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.