మెహదీపట్నం, వెలుగు: మెహదీపట్నంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.26.80 లక్షల విలువైన 137.60 గ్రాముల ఎండీఎంఏ, ఒక వోల్వో కారు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్, ప్యాకింగ్ కవర్లు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్‌కు చెందిన ప్రధాన నిందితుడు ఎమ్. శుభమ్ కుమార్ మిశ్రా, అతని చిన్ననాటి స్నేహితుడు బుసా సాయి నిఖిల్ యాదవ్‌కు గంజాయి, ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉంది. ఈ క్రమంలో శుభమ్ తన సొంత వినియోగానికి, ఇతరులకు విక్రయించడానికి సాయి నిఖిల్ వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్‌ను సేకరించేవాడు. అయితే, సాయి నిఖిల్‌ను ఇటీవల చిలకలగూడ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
సాయి నిఖిల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా శుభమ్ తన వ్యాపారాన్ని ఆపలేదు. తన స్నేహితులైన సోహమ్ నాయక్, కలంగి రాజేశ్‌తో కలిసి దందాను కొనసాగించాడు. శుభమ్ పెద్ద మొత్తంలో తెచ్చిన డ్రగ్స్‌ను వీరు చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి కస్టమర్లకు విక్రయించేవారు. ఈ డ్రగ్స్‌ను చేరవేయడానికి శుభమ్ స్వయంగా వెళ్లడమే కాకుండా, రాపిడో సర్వీసులను ఉపయోగించేవాడు. తన అన్న ముంతున్ కుమార్ మిశ్రా ద్వారా కూడా డ్రగ్స్ డెలివరీ చేయించేవాడు. పక్కా సమాచారంతో గోల్కొండ జోన్ టాస్స్‌ఫోర్స్, మెహదీపట్నం పోలీసులు కలిసి శనివారం వీరిని అరెస్ట్ చేశారు. వీరితోపాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మహ్మద్ అబ్రార్, రషీద్ బిన్ హుస్సేన్, ఖాజా జోహైబుద్దీన్, అబ్దుల్ షాబాజ్ అదుపులోకి తీసుకున్నారు.
