తెలంగాణలో డీఎస్సీ వాయిదా .. ఎగ్జామ్స్‌‌ను పోస్ట్​పోన్‌‌ చేసిన స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ డైరెక్టర్‌‌‌‌

తెలంగాణలో డీఎస్సీ వాయిదా ..  ఎగ్జామ్స్‌‌ను పోస్ట్​పోన్‌‌ చేసిన స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ డైరెక్టర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. నవంబర్‌‌‌‌ 20 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన ఈ ఎగ్జామ్స్‌‌ను అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ డైరెక్టర్‌‌‌‌ శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. ఆరేండ్ల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,089 టీచర్‌‌‌‌ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌‌‌‌ 6న డీఎస్సీ నోటిఫికేషన్‌‌ ఇచ్చారు. 

అదే నెల 20 నుంచి ఈ నెల 21 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, ఎగ్జామ్‌‌‌‌ వాయిదా పడింది.  వచ్చే నెల 20 నుంచి ఎస్జీటీ,​ పీఈటీ, పీడీ, లాంగ్వేజీ పండిట్లు, స్కూల్ అసిస్టెంట్లకు వేర్వేరుగా ఎగ్జామ్ డేట్స్‌‌‌‌ ఇచ్చారు. నవంబర్ 30న పోలింగ్ తేదీ కావడం, అదే రోజు డీఎస్సీ ఎగ్జామ్ ఉండటంతో, పరీక్ష వాయిదా అనివార్యమైంది. కాగా, ఆన్‌‌‌‌లైన్ ఎగ్జామ్స్ అయినా ఎన్నికల సమయంలో ఇన్విజిలేషన్, బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేయడం సాధ్యమయ్యేలా కనిపించలేదు. దీంతో డీఎస్సీ వాయిదాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన.. గురువారం విద్యా శాఖ సెక్రటరీ వాకాటి కరుణకు నివేదిక అందించగా, ఆమె పరీక్షను వాయిదా వేశారు. సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులను ఆదేశించారు. 

ఫిబ్రవరిలో పరీక్షలు..

డీఎస్సీ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేసినా సర్కారు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పరీక్షల వాయిదా అనివార్యమైంది. ప్రస్తుతం డిసెంబర్ మొదటి వారం వరకు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగనుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరాలంటే కొంత సమయం పట్టే అవకాశముంది. దీనికి తోడు ఆన్‌‌‌‌లైన్ ఎగ్జామ్స్ కాబట్టి, ఆ సమయంలో ఇతర పరీక్షలుంటే డీఎస్సీ నిర్వహణ కష్టంగా ఉండే అవకాశముంది. 

ప్రస్తుతం టీఎస్ ఆన్‌‌‌‌లైన్ అధికారుల ప్రైమరీ రిపోర్టు ప్రకారం ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ నిర్వహణకు తేదీలు ఖాళీగా ఉన్నాయని విద్యా శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటివరకు డీఎస్సీకి 80 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎస్జీటీ పోస్టుల కోసం దాదాపు 35 వేల వరకు అప్లికేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఎస్‌‌‌‌ఏ సోషల్‌‌‌‌కు 12 వేలు, ఎస్‌‌‌‌ఏ బయోలజీ కోసం 10 వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే, ఎగ్జామ్స్ వాయిదా పడటంతో దరఖాస్తు గడవు కూడా పెంచే అవకాశం ఉంది.