- రూల్స్ సామాన్యుడికేనా అంటూ ప్రశ్నిస్తున్న స్థానికులు
- పాతబస్తీలోని దారుల్షిఫాలో ఓ కాంట్రాక్టర్ నిర్వాకం
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ విధించారు. కానీ హైదరాబాద్‌లోని దారుల్షిఫా ప్రాంతంలో మాత్రం నైట్ కర్ఫ్యూ నిబంధనలు గాలికొదిలేశారు. కరోనా భయం లేకుండా.. పాతబస్తీలోని దారుల్షిఫా ప్రాంతంలో రాత్రి వేళ 70 మంది లేబర్లతో ఓ కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చేయించాడు. ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించడంతో స్థానిక కూలీలు ఎవరూ పనులకు రాకపోవడంతో.. బయటనుంచి 70 మంది కూలీలను తీసుకువచ్చి 12 కాంక్రిట్ మిక్సర్ లారీలతో ఓ కాంట్రాక్టర్ రాత్రివేళ నిర్మాణ పనులు చేపట్టాడు. అది చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కూలీలు ఎక్కడినుంచి వచ్చారో, వారి ద్వారా కరోనా సోకుతుందేమోనని అక్కడి వారు భయపడుతున్నారు. రూల్స్ కేవలం సామాన్యులకేనా? పెద్దవాళ్లకు రూల్స్ వర్తించవా? అని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కనీసం స్థానిక పోలీసులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో విస్మయానికి గురవుతున్నారు. నైట్ కర్ఫ్యూ విధించినప్పుడు ఇలా పనులు చేయించుకోవడానికి ఆ కాంట్రాక్టర్‌కు ఎవరు పర్మిషన్ ఇచ్చారని, జీహెచ్ఎంసీ అధికారులపై మరియు పోలీసులపై స్థానికులు మండిపడుతున్నారు.
