భారత్‌‌లో అవకాశాలు అపారం ..యువ ప్రతిభను ఉపయోగించుకోండి.. 

భారత్‌‌లో అవకాశాలు అపారం ..యువ ప్రతిభను ఉపయోగించుకోండి.. 
  • డచ్​ కంపెనీలకు ప్రధాని పిలుపు
  • నెదర్లాండ్స్‌‌లో సీఈవో సదస్సులో  మోదీ ప్రసంగం

ది హేగ్: భారత్‌‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అపార అవకాశాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పన్నులు, కార్మిక చట్టాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి వ్యాపారాలకు అనుకూలంగా కీలక మార్పులు చేసినట్టు చెప్పారు. గత కొన్నేండ్లుగా పటిష్టమైన వృద్ధిరేటుతో సుస్థిరత సాధించామని వెల్లడించారు.

నెదర్లాండ్‌‌ పర్యటనలో భాగంగా ఆదివారం ప్రముఖ కంపెనీల సీఈవోలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. నేటి భారత్‌‌ అపారమైన మార్కెట్ సామర్థ్యానికి, సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థకు మారుపేరుగా నిలిచిందని పేర్కొన్నారు. ‘‘భారతదేశంలో డిజైన్ చేయండి, ఆవిష్కరించండి, వస్తువులను తయారు చేయండి.

దేశంలోని అపారమైన యువ ప్రతిభను ఉపయోగించుకోవడానికి డచ్ కంపెనీలకు ఇదే సువర్ణావకాశం” అని పిలుపునిచ్చారు. డచ్ పీఎం రాబ్ జెట్టెన్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ఇరు దేశాల వ్యాపారాలకే కాకుండా, భావి తరాలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సరికొత్త శిఖరాలకు ద్వైపాక్షిక బంధం
ప్రధాని నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ తాత్కాలిక ప్రధాని రాబ్ జెట్టెన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇరు దేశాల సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుతూ ఇరు నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణ రంగ పరిశ్రమల కోసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడంతో పాటు అంతరిక్ష ప్రయాణాలు, సముద్ర భద్రత రంగాల్లో కలిసి పనిచేయడానికి అంగీకారం కుదిరింది. దేశంలోనే తొలిసారిగా గుజరాత్‌‌లోని ధోలేరాలో ఏర్పాటు కానున్న సెమీకండక్టర్ ప్లాంట్‌‌కు సంబంధించి ‘టాటా ఎలక్ట్రానిక్స్’, డచ్ దిగ్గజం ‘ఏఎస్‌‌ఎంఎల్‌‌’ సంస్థల మధ్య చరిత్రాత్మక ఒప్పందం జరిగింది.  

నెదర్లాండ్స్‌‌లోని ప్రసిద్ధ 32 కిలోమీటర్ల పొడవైన ‘అఫ్స్లూయిట్‌‌డిజ్క్’ డ్యామ్‌‌ను ప్రధాని మోదీ సందర్శించారు. సముద్రపు నీటిని అడ్డుకునే ఈ డచ్ వరద నియంత్రణ సాంకేతికతను గుజరాత్‌‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘కల్పసర్’ ప్రాజెక్టుకు ఉపయోగించనున్నారు. ఖంభాత్ గల్ఫ్ వద్ద మంచినీటి జలాశయం, అలల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టు సాంకేతిక సహకారం కోసం భారత జలశక్తి మంత్రిత్వ శాఖ, నెదర్లాండ్స్ మౌలిక సదుపాయాల శాఖ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌‌పై సంతకాలు చేశాయి.

పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల పట్ల ఇరు దేశాల ప్రధానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్​ జలసంధి గుండా నౌకల రాకపోకలు స్వేచ్ఛగా సాగాలని, ఎలాంటి ఆంక్షలు విధించకూడదని స్పష్టం చేశారు. అలాగే, ఉక్రెయిన్ సంక్షోభాన్ని యూఎన్‌‌వో నిబంధనలు, అంతర్జాతీయ చట్టాల ప్రకారం శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. యూఎన్‌‌ భద్రతా మండలిలో  భారత్‌‌కు శాశ్వత సభ్యత్వం లభించేందుకు తమ మద్దతు కొనసాగుతుందని జెట్టెన్ పునరుద్ఘాటించారు.

ముగిసిన నెదర్లాండ్స్‌‌ పర్యటన

నెదర్లాండ్స్‌‌లో తన రెండు రోజుల పర్యటనను ప్రధాని మోదీ  విజయవంతంగా ముగించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన స్వీడన్‌‌కు బయలుదేరి వెళ్లారు. రాత్రి గాథెన్‌‌బర్గ్​కు చేరుకున్న ప్రధానికి ఎయిర్ పోర్ట్​లో ఘన స్వాగతం లభించింది.

భారత్‌‌ చేతికి చోళుల తామ్ర శాసనాలు


నెదర్లాండ్స్‌‌ పర్యటనలో భాగంగా డచ్ రాజు విల్లెమ్ -అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మోదీ కలిసి ప్రత్యేక చర్చలు జరిపారు. అలాగే అక్కడి భారత సంతతి ప్రజలతో ముచ్చటించారు. సురినామీస్ హిందుస్తానీ కమ్యూనిటీకి ఓసీఐ కార్డ్ అర్హతను 4వ తరం నుంచి 6వ తరానికి పెంచడం పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తంచేశారు. ఈ పర్యటనలో మరో భావోద్వేగ భరితమైన ఘట్టం చోటుచేసుకుంది.

11వ శతాబ్దపు చోళుల కాలానికి చెందిన అరుదైన 24 తామ్ర పత్రాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం భారత్‌‌కు అప్పగించింది. ఈ శాసనాలు రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడి కాలం నాటి ఘన చరిత్రను, నౌకా పరాక్రమాన్ని వివరిస్తాయి. ఈ చారిత్రక సంపదను తిరిగి భారత్‌‌కు అప్పగించడంపై డచ్‌‌ సర్కారుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.