V6 News

అథ్లెటిక్స్‌‌ ప్రపంచ చాంపియన్‌‌షిప్‌‌లో ద్యుతీకి నిరాశ

అథ్లెటిక్స్‌‌ ప్రపంచ చాంపియన్‌‌షిప్‌‌లో ద్యుతీకి నిరాశ

దోహా:  అథ్లెటిక్స్‌‌ ప్రపంచ చాంపియన్‌‌షిప్‌‌లో రెండో రోజు కూడా ఇండియా అథ్లెట్లు సత్తా చాటలేకపోయారు. శనివారం జరిగిన మహిళల 100 మీటర్ల రేసులో ద్యుతీచంద్‌‌ ఘోరంగా నిరాశపర్చింది. హీట్స్‌‌–3లో బరిలోకి దిగిన ద్యుతీ 11.48 సెకన్ల టైమింగ్‌‌తో ఏడో స్థానంలో నిలిచింది.  మొత్తం 47 మంది పోటీపడ్డ ఈ రేస్‌‌లో ఓవరాల్‌‌గా 37వ స్థానంతో సరిపెట్టుకుంది. కనీసం సెమీస్‌‌కైనా అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ద్యుతీ దానిని కూడా సాధించలేకపోయింది. 2012 ఒలింపిక్‌‌ చాంపియన్‌‌ షెల్లీ అన్‌‌ ఫ్రేజర్‌‌ ప్రైస్‌‌ (జమైకా), గత ఎడిషన్‌‌ సిల్వర్‌‌ మెడిలిస్ట్‌‌ మారియా జోసీ టా లూ (ఐవరీ కోస్ట్‌‌) వరుసగా 10.80 సెకన్లు, 10.85 సెకన్లతో సెమీస్‌‌కు అర్హత సాధించారు. ఈ ఇద్దరి టైమింగ్‌‌తో పోలిస్తే ఇండియన్‌‌ అథ్లెట్‌‌ ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఏడాది ఏప్రిల్‌‌లో ఇదే ట్రాక్‌‌పై జరిగిన ఆసియా చాంపియన్‌‌షిప్‌‌ హీట్స్‌‌లో 11.28 సెకన్ల టైమింగ్‌‌ను నమోదు చేసిన 23 ఏళ్ల ద్యుతీ.. సెమీస్‌‌లో 11.26 సెకన్లతో జాతీయ రికార్డును నెలకొల్పింది. కానీ ఈ రేస్‌‌లో మాత్రం పూర్వ వైభవాన్ని అందుకోలేకపోయింది. ఈ సీజన్‌‌లోనే మూడోసారి అత్యంత చెత్త టైమింగ్‌‌ను నమోదు చేసింది. ఫిబ్రవరి, మార్చిలో జరిగిన ఫెడరేషన్‌‌ కప్‌‌ హీట్స్‌‌లో వరుసగా 11.28 సెకన్లు, 11.26 సెకన్ల టైమింగ్‌‌ను నెలకొల్పింది.  మరోవైపు పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌‌లో జబీర్‌‌ మదారి సెమీస్‌‌తోనే సరిపెట్టుకున్నాడు. సెమీస్‌‌ మూడో హీట్స్‌‌లో బరిలోకి దిగిన జబీర్‌‌ 49.71 సెకన్లతో ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. ఓవరాల్‌‌గా 16వ స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఫైనల్లో ఇండియా రిలే టీమ్‌‌..

4X400 మీటర్ల మిక్స్​డ్​ రిలే రేస్‌‌లో ఇండియా బృందం చెలరేగింది. సీజనల్‌‌ బెస్ట్‌‌ను నమోదు చేస్తూ ఫైనల్స్‌‌కు అర్హత సాధించింది. మహ్మద్‌‌ ఆనాస్‌‌, విస్మయ, జిస్నా మాథ్యూ, నిర్మల్‌‌ టామ్‌‌తో కూడిన ఇండియన్‌‌ టీమ్‌‌ హీట్స్‌‌–2లో 3ని: 16.14 సెకన్ల టైమింగ్‌‌తో మూడో స్థానంలో నిలిచింది. అంతకుముందు జరిగిన హీట్స్‌‌–1లో టైరిల్‌‌ రిచర్డ్‌‌, జెస్సికా బియర్డ్‌‌, జాస్మిన్‌‌ బ్లాకర్‌‌, ఒబీ ఇగ్బోవీతో కూడిన అమెరికా బృందం 3ని:12.42 సెకన్ల టైమింగ్‌‌తో ప్రపంచ రికార్డును నెలకొల్పుతూ ఫైనల్స్‌‌కు అర్హత సాధించింది.

100 మీటర్ల ఫైనల్లో కోల్‌‌మన్‌‌

ఈ చాంపియన్‌‌షిప్‌‌కే తలమానికమైన 100 మీటర్ల రేస్‌‌లో అమెరికా కుర్రాడు క్రిస్టియాన్‌‌ కోల్‌‌మన్‌‌ సత్తా చాటాడు. హీట్స్‌‌–1లో బరిలోకి దిగిన కోల్‌‌మన్‌‌ 9.88 సెకన్లతో టాప్‌‌లో నిలిచి ఫైనల్స్‌‌కు అర్హత సాధించాడు. ఇదే హీట్స్‌‌లో 10.12 సెకన్ల టైమింగ్‌‌ నమోదు చేసిన బ్రౌన్‌‌ (కెనడా) కూడా క్వాలిఫై అయ్యాడు. హీట్స్‌‌–2లో ఆండ్రీ డి గ్రాస్‌‌ (కెనడా) 10.07 సెకన్లు, బ్లేక్‌‌ (జమైకా) 10.09 సెకన్లతో ఫైనల్స్‌‌కు అర్హత సాధించారు. హీట్స్‌‌–3 నుంచి సింబిని (రష్యా) 10.01 సెకన్లు, జార్నెల్‌‌ హ్యుస్‌‌ (బ్రిటన్‌‌) 10.05 సెకన్లతో క్వాలిఫై అయ్యారు. ఓవరాల్‌‌గా ఈ మూడు హీట్స్‌‌లో వీళ్ల తర్వాత ఫాస్టెస్ట్‌‌గా పరుగెత్తిన జస్టిన్‌‌ గాట్లిన్‌‌ (అమెరికా–10.09 సెకన్లు), ఫిలిపో టోర్టు (ఇటలీ–10.11 సెకన్లు) కూడా ఫైనల్స్‌‌కు వచ్చారు.