తిరుమలకు వెళ్లే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతి ఎయిర్ పోర్టులో ఈ-వీసా సేవలు

తిరుమలకు వెళ్లే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతి ఎయిర్ పోర్టులో ఈ-వీసా సేవలు

న్యూఢిల్లీ: కళియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి విమానాశ్రయంలో ఈ-వీసా సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు విదేశీ భక్తులు తిరుపతి రావాలంటే చెన్నై లేదా బెంగళూర్, హైదరాబాద్ చేరుకొని అక్కడ ఈ -వీసా ప్రక్రియ పూర్తిచేసుకుని అటు నుంచి తిరుపతి చేరుకునేవారు. 

అయితే, కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో తిరుపతి విమానాశ్రయంలోనే ఈ - వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే విదేశీ భక్తులు ఇకపై నేరుగా తిరుపతి విమానాశ్రయం చేరుకొని అక్కడే ఈ - వీసా ప్రక్రియ ముగించుకోవచ్చు. ప్రయాణానికి కనీసం పది రోజుల ముందే ప్రయాణికులు ఆన్లైన్లో ఈ -  వీసా అందుకోవాలి. 

కాగా, తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు లేనప్పటికీ ముందస్తుగానే కేంద్ర పౌర విమానయాన శాఖ ఈ- వీసా కౌంటరు మంజూరు చేసింది. అలాగే, తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి త్వరలోనే ఇంటర్నేషనల్ సర్వీస్‎లు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. 2007లోనే తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోగా.. 2017లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.