హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు.. 96 మందిని గుర్తించిన ఈగల్ ఫోర్స్

హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు.. 96 మందిని గుర్తించిన ఈగల్ ఫోర్స్
  • మహారాష్ట్ర, గుజరాత్‌‌కు చెందిన 60 మందికి నోటీసులు

హైదరాబాద్, వెలుగు: థాయ్‌‌లాండ్ నుంచి హైదరాబాద్‌‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాలకు సాగుతున్న హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ మూలాలను రాష్ట్ర 'ఈగల్ ఫోర్స్' బయటపెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ ట్రాఫికింగ్ చేస్తున్న నెట్‌‌వర్క్‌‌ను ఛేదించే దిశగా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో డ్రగ్ సిండికేట్‌‌కు చెందిన 96 మందిని అధికారులు గుర్తించారు.

ఇందులో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 60 మందికి నోటీసులు జారీ చేశారు. వీరంతా థాయ్‌‌లాండ్ నుంచి దేశంలోని వివిధ నగరాలకు హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తున్నట్లు పక్కా ఆధారాలు సేకరించారు. ఈ మేరకు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య 
శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. శంషాబాద్ ఎయిర్‌‌పోర్టులో పట్టుబడిన హైడ్రోపోనిక్ గంజాయి ఆధారంగానే ఈ అంతర్జాతీయ నెట్‌‌వర్క్‌‌ను ఛేదించినట్లు తెలిపారు.

 సిండికేట్ లింకులు బయటపడ్డాయి ఇలా..

ఈ ఏడాది ఏప్రిల్ 7న బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌‌పోర్టుకు వచ్చిన సోదా మొహ్సిన్ బహదూర్ భాయ్ వద్ద కస్టమ్స్ అధికారులు 13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత హర్షద్ మన్సుఖ్ భాయ్ ప్రజాపతి, సందీప్ జయప్రకాశ్ వాస్వానిలను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. వీరి వద్ద నుంచి మరో 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన నిందితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులు అంతర్జాతీయ డ్రగ్ నెట్‌‌వర్క్ మూలాలను కనుగొన్నారు. కేవలం డ్రగ్ క్యారియర్లకే పరిమితం కాకుండా.. మహారాష్ట్ర, గుజరాత్‌‌కు చెందిన 60 మంది ప్రధాన హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లర్లను గుర్తించారు. వీరికి ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ 67 కింద నోటీసులు జారీ చేసినట్లు ఈగల్ ఫోర్స్ స్పష్టం చేసింది.