ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. మంగళవారం (ఏప్రిల్ 21) తెల్లవారుజామున కామ్‌జోంగ్ జిల్లాలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఉదయం 5.59 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించినట్లు తెలిపింది.
కమ్‌జోంగ్ జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూ అంతర్భాగంలో 62 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అప్పుడే నిద్రలోనుంచి లేస్తోన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్ధంకాక ఆందోళనకు గురయ్యారు.
కొందరు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ యంత్రాగం అప్రమత్తమైంది. భూకంప ప్రభావిత ప్రాంతంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకైతే ఎటువంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.

