భూకంపం ముప్పు.. 14 సిటీలకు హైరిస్క్​

భూకంపం ముప్పు.. 14 సిటీలకు హైరిస్క్​

దేశంలోని ప్రధాన సిటీలకు భూకంప ముప్పు పొంచి ఉంది. ఎత్తైన బిల్డింగులు కట్టిన చోట ఆ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. 14 సిటీలు ‘హై రిస్క్​’ జోన్​లో ఉన్నాయి. మరో 15 నగరాలు మీడియం రిస్క్​ జోన్​లో ఉన్నాయి. నేషనల్​ డిజాస్టర్​ మేనేజ్​మెంట్​అథారిటీ (ఎన్​డీఎంఏ), ట్రిపుల్​ఐటీ– హైదరాబాద్​  కలిసి చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. దాదాపు 13 ఏళ్ల పాటు 50 నగరాలపై స్టడీ చేసిన తర్వాత ఎన్​డీఎంఏ ఇటీవల ఎర్త్​క్వేక్​ డిజాస్టర్​ రిస్క్​ ఇండెక్స్​ పేరిట రిపోర్టును విడుదల చేసింది. స్టడీ చేసిన 50 సిటీల్లోని 25 సిటీలు, నిర్మాణాలు ఎక్కువ చేపట్టిన ప్రాంతాల్లో తిరిగి డేటాను తీసుకుంది. ఆ డేటా ఆధారంగా కంప్యూటర్​ మోడల్​ను తయారు చేసి సిటీలకు భూకంప ముప్పును లెక్కగట్టింది. ఈ హై రిస్క్​ జోన్​లో తెలుగుసిటీ విజయవాడ కూడా ఉంది. అది జోన్​ 4లో ఉంది. బిల్డింగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూకంప ముప్పుతో నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేగాకుండా దేశంలోని 59 శాతం ప్రాంతాలకు భూకంపాలు వచ్చే ముప్పు ఉందని, ఆయా ప్రాంతాలన్నీ జోన్​ 3, 4, 5లోనే ఉన్నాయని చెప్పింది. ఇంతకుముందు వచ్చిన భూకంపాల్లో చనిపోయిన వాళ్లలో 90 శాతం మంది పెద్ద పెద్ద బిల్డింగులు నేలమట్టం కావడం వల్లే చనిపోయారని తేల్చి చెప్పింది.

ఇండియాకు ముప్పు ఎందుకు?

5 కోట్ల ఏళ్ల క్రితం యురేసియాతో భారత ఉపఖండం ప్లేట్లు ఢీకొట్టాయన్నది సైంటిస్టుల మాట. అంతకుముందు ఏటా 18 సెంటీమీటర్ల చొప్పున మహాసముద్రంలో ఇండియా ప్లేటు కదిలేవని, భూమి చరిత్రలో అంత వేగంగా ఏ ఖండమూ కదల్లేదని అంటూ ఉంటారు. ఆ స్పీడుతో యురేసియా ప్లేట్లతో ఢీకొట్టడం వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయని సైంటిస్టులు చెబుతారు. ఆ తర్వాత ఇండియా ప్లేటు నెమ్మదించినా, కదలడం మాత్రం ఆగట్లేదు. యురేసియాను ఢీకొట్టాక ప్లేట్​లోని అప్పర్​ క్రస్ట్​ (భూ పటలం) హిమాలయాల్లోకి చేరిందట. మిగతా అంతా కూడా ఎర్త్​ మాంటిల్​(పటలం కింది భాగం)లోకి చొచ్చుకెళ్లిపోయిందట. అలా కిందికెళ్లిపోయిన భూ పలకలు ఏటా 2 సెంటీమీటర్ల చొప్పున యురేసియాలోకి చొచ్చుకొస్తున్నాయట. అలా చేరే క్రమంలో ఒక్కోసారి క్రస్ట్​ బ్లాక్​ అయిపోయి సడన్​గా కిందికి జారేదట. అలా జారినప్పుడు విడుదలయ్యే శక్తితో భూ పటలంలో ప్రకంపనలు పుట్టి, ఆ ప్రకంపనలు భూ ఉపరితలానికి చేరుతున్నాయట. దాని వల్లే ఇండియాలో భూకంపాలు వస్తున్నాయట.

ముప్పు తగ్గించాలంటే ఏం చేయాలి?

భూకంప ముప్పు అత్యంత ఎక్కువగా ఉన్న జోన్లలో కేంద్రం స్మార్ట్​ సిటీలకు ఎంపిక చేసిన నగరాలూ ఉన్నాయి. ఆయా సిటీలతో పాటు చాలా చోట్ల పట్టణాల్లో జనాభా (అర్బనైజేషన్​) పెరిగిపోతోంది. దానికి తగ్గట్టు ఎక్కడికక్కడ నియంత్రణ లేకుండా ఇబ్బడిముబ్బడిగా కట్టడాలు వెలుస్తున్నాయి. కనీస సేఫ్టీ నిబంధనలను పాటించట్లేదు. భూకంపాలను తట్టుకునే విధంగా వాటిని కట్టట్లేదు. కాబట్టి, ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు, విద్యావేత్తలు కలిసి భూకంప ముప్పుపై అవగాహన కల్పించాల్సి ఉందని ఎన్​డీఎంఏ చెబుతోంది. దానికి తగ్గట్టు నిర్మాణ ప్రమాణాలను తీసుకురావాలని సూచిస్తోంది. ఇప్పటికే కట్టిన బిల్డింగులు భూకంపాలను ఎంత వరకు తట్టుకుంటాయో అంచనా వేయాలని చెబుతోంది. ఒకవేళ ఆ సామర్థ్యం లేకపోతే, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కొత్తగా కట్టే బిల్డింగులకు బ్యూరో ఆఫ్​ ఇండియన్​ స్టాండర్డ్స్​ పెట్టిన ఎర్త్​క్వేక్​ ఇంజనీరింగ్​ గైడ్​లైన్స్​ను విధిగా పాటించేలా ఆదేశాలివ్వాలని చెప్పింది. ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

హై రిస్క్​ జోన్​లో ఉన్న సిటీలు

సిటీ                                        రాష్ట్రం

శ్రీనగర్​                                  జమ్మూకాశ్మీర్​

ఐజ్వాల్​                                మిజోరాం

పిథోడ్​గఢ్​                              ఉత్తరాఖండ్​

భాగల్పూర్​​                             బీహార్​

పానిపట్​                                హర్యానా

షిమ్లా                                   హిమాచల్​ప్రదేశ్​

సోలన్​                                   హిమాచల్​ ప్రదేశ్​

రత్నగిరి                                మహారాష్ట్ర

గ్యాంగ్​టక్​                              సిక్కిం

మొరాదాబాద్​                         ఉత్తర్​ప్రదేశ్​

ఉత్తరకాశీ                              ఉత్తరాఖండ్​

నైనిటాల్​                              ఉత్తరాఖండ్​

విజయవాడ                         ఆంధ్రప్రదేశ్​

మునుపటి భూకంపాల వివరాలు

ఏడాది       ప్రాంతం             తీవ్రత             మరణాలు              కూలిన బిల్డింగులు

1988       బీహార్​-నేపాల్​     6.4                1,004                   2,50,000

1991       ఉత్తరకాశీ           6.6                 768                    42,400

1993       కిలారీ (లాతూర్​) 6.3                  8,000                   30,000

1997       జబల్​పూర్​         6.0                    38                     8,546

1999       చమోలీ             6.8                 100                       2,595

2001       భుజ్​ (గుజరాత్​) 6.9                  3,805                  2,31,000

2005       కాశ్మీర్​              7.6                 1,500                   4,50,000

2011       సిక్కిం               6.9                   110                    –––––