కరోనా ఎఫెక్ట్ : రైళ్లు, బస్సులు ఖాళీ

కరోనా ఎఫెక్ట్ : రైళ్లు, బస్సులు ఖాళీ
  •               గాంధీ నుంచి ఉస్మానియాకు పేషెంట్లు
  •                మహేంద్రాహిల్స్​లో సాధారణ పరిస్థితి
  •                61 స్కూళ్లలో హోమియో మందుల పంపిణీ

కరోనా వైరస్​ భయం నగరవాసులను ఇంకా వీడలేదు. జనం తప్పనిసరైతే తప్ప రోడ్డెక్కడంలేదు. అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చినా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శనివారం ఊరెళ్లే వారు ప్రయాణాలు వాయిదా వేసుకున్నరు. దీంతో అటు రైల్వేస్టేషన్లు, ఇటు బస్​స్టేషన్లలో రద్దీ చాలా తగ్గింది. రెండు రోజులుగా పార్కులు బోసిపోయి కనిపిస్తున్నయి. కార్పొరేట్​ ఆస్పత్రులకు వచ్చే పేషెంట్ల సంఖ్య కూడా తగ్గింది. ఎమర్జెన్సీ కేసులే తప్ప నార్మల్​ చెకప్​లు రావట్లేదు. దేవాయాల్లో భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఓయూలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొన్ని వేలమంది జాగింగ్​ చేసేవారు. కరోనా దెబ్బతో జాగింగ్​చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గాంధీలో కరోనా పేషెంట్లకు మాత్రమే వైద్యసేవలందిస్తూ ఓపీ సేవలు నిలిపివేశారు. దీంతో గాంధీ నుంచి వేలసంఖ్యలో రోగులు ఉస్మానియా ఆసుపత్రికి వెళుతుండటంతో అక్కడ ఓపీ నమోదు రెట్టింపు అయింది. ఇక కరోనా వైరస్​ నియంత్రణలో భాగంగా బస్​స్టేషన్లు, రైల్వే స్టేషన్​లలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

రైల్వే, బస్​ స్టేషన్లలో తగ్గిన రద్దీ..

కరోనా ప్రభావంతో నగరంలోని నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో ప్రయాణీలకు రద్దీ చాలా వరకు తగ్గింది. సికింద్రాబాద్​ నుంచి రోజుకు సుమారు 1.80 లక్షల మంది, కాచిగూడ నుంచి 50వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటరు. రెండు రోజులుగా ఈ సంఖ్య కనీసం 5 నుంచి 10 శాతానికి తగ్గింది. శనివారంపూట ఎంజీబీఎస్, జేబీఎస్​లలో జనంతో కిటకిటలాడే బస్సులు.. ఇప్పుడు కనీసం సగం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి నెలకొంది.

తగ్గిన అంతర్జాతీయ విమాన సర్వీసుల చార్జీలు

కరోనా వైరస్​ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులలో ప్రయాణీకుల సంఖ్య తగ్గింది. గత వారంలో 256 సీట్ల సామర్థ్యం ఉన్న విమానం ఒకటి సింగపూర్​ నుంచి ముంబైకి కేవలం 25 మందితో చేరుకుందంటే కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రయాణీకుల స్పందన లేకపోవడంతో  రూ.80 వేలు ఉండే విమాన టికెట్ రూ.46వేలకు తగ్గాయి.

స్కూళ్లల్లో హోమియో మందుల పంపిణీ

విద్యాశాఖ అధికారులు  నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు హోమియో మందులు, మాస్కులు పంపిణీ చేశారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత హోటళ్లు, పర్యాటక కేంద్రాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

మహేంద్రాహిల్స్ నార్మల్

కరోనా వైరస్​తో వార్తల్లోకి ఎక్కిన సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ బోర్డు పరిధిలోని  మహేంద్రాహిల్స్​లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్​ కేసు నమోదైన వీధిలో పరిస్థితి అలాగే కొనసాగుతోంది. జనం ఇండ్ల నుంచి బయటికి రావడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ముఖానికి మాస్కుతో వస్తున్నారు. మారేడుపల్లి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సుమారు 61 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు హోమియో మందులు, మాస్కులు సరఫరాచేశారు.

అద్దె ఇంటికీ  నో-కరోనా సర్టిఫికెట్​..

బయటి దేశాలకు వెళ్లాలన్నా, విదేశాల నుంచి వచ్చినా, ఇల్లు అద్దెకు కావాలన్నా… కరోనా వైరస్​ లేదంటూ గాంధీ వైద్యులు జారీ చేసిన సర్టిఫికెట్​ ఉండాల్సిందే. అద్దె ఇల్లు కావాలంటే ఆయా కాలనీల వాసులు నో కరోనా వైరస్​ సర్టిఫికెట్​ కావాలంటున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లను గాంధీ ఆసుపత్రి వైద్యులే జారీచేయాల్సి ఉండటంతో అక్కడికి పరుగులు తీస్తున్నారు. మహేంద్రహిల్స్​ వంటి ప్రాంతాలలో సర్టిఫికెట్​ ఉంటేనే ఇల్లు అద్దెకు ఇస్తామంటున్నరు. ఇతర దేశాలకు వెళ్లాలంటే కూడా ​ సర్టిఫికెట్​ ఉంటేనే వీసాజారీచేస్తున్నారు.

104కు పెరిగిన ఫిర్యాదులు

గాంధీ లో ఏర్పాటు చేసిన హెల్ప్​డెస్క్​ ఆగిపోగా, శుక్రవారం నుంచి 104 హెల్ప్​డెస్క్​ అందుబాటులోకి వచ్చింది. ఇందులో షిఫ్టువారీగా సుమారు 40మంది సేవలందిస్తున్నారు. దీనికి మొదటి రోజే  దాదాపు 210 కాల్స్​ రాగా..   శనివారం 190 వరకు కాల్స్​ వచ్చినట్లు అధికారులు చెప్పారు.అయితే ఇందులో అత్యధికంగా సలహాలు, సూచనల కోసమే కాల్స్​ వస్తున్నట్లు తెలిపారు.